బాబు.. జనం బాదితే గానీ అర్థం కాదా?

1 Dec, 2022 21:09 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం అట్టర్ ప్లాప్ కావడానికి కారణమేంటి.? బాదుడే బాదుడు పక్కన పెట్టి ఇదేం కర్మ అనే కొత్త కార్యక్రమాన్ని టీడీపీ ఎందుకు ప్రారంభించింది..? బాదుడే బాదుడు కార్యక్రమం కనీసం చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాల్లో అయినా సక్సెస్ అయ్యాయా? టీడీపీ విస్తృత స్థాయి సమావేశం వేదికపై నుంచి బాదుడే బాదుడు గురించి పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ చెప్పిన నిజాలు ఏంటి?..

ఎల్లో రేటింగ్.. ఆపై గ్రేడింగ్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లో ఎండగడతామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనేక బహిరంగ సభల్లో ప్రసంగించారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులను చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందని అనేక సందర్భాల్లో చంద్రబాబు తమ కేడర్‌ను ఉత్సాహపరిచేందుకు ప్రయత్నించారు. బాదుడే బాదుడు జరిగిన తీరుపై ఏ బీ సీ డీ పేరిట నాలుగు గ్రేడులుగా విభజించి రేటింగ్స్ ఇవ్వాలని ప్రోగ్రామ్ కమిటీని చంద్రబాబు ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన తీరు ఆధారంగా అక్కడి నాయకులకు గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు.

ఇదేం కర్మ బాబూ?
ఒక పక్కన బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజలనుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తోందని డప్పు కొట్టుకుంటూ.. హఠాత్తుగా ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టి ఇదేం కర్మ అంటూ మరో కొత్త కార్యక్రమాన్ని టీడీపీ తెరపైకి తీసుకువచ్చింది. బాదుడే బాదుడుకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని చెప్పుకుంటున్న టీడీపీ ఆ కార్యక్రమాన్ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి?. బాదుడే బాదుడు కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన విధానాన్ని ఇటీవల చంద్రబాబు సమీక్షించారట. చంద్రబాబు, లోకేష్ నియోజకవర్గాలతో సహా ఎక్కడా అనుకున్నంత స్థాయిలో బాదుడు కార్యక్రమం జరగలేదట. చంద్రబాబు స్వయంగా పాల్గొన్న సమావేశాలకు కూడా జనాలు కరువయ్యారు. కొన్నిచోట్ల చంద్రబాబు ప్రసంగించే సమయానికి ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. 

ఏ గ్రేడ్‌లో సున్నా..
చంద్రబాబు బాధ భరించలేక ఈ కార్యక్రమానికి జనాలను సమీకరించడం కోసం టీడీపీ నేతలు నానా హైరానా పడ్డారు. టీడీపీ నేతలు ఎంత ప్రయత్నించినా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జనాలు పట్టించుకోలేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో నియోజకవర్గ స్థాయిలో ఏ నాయకుడు కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా నిర్వహించలేదు. ఎల్లో మీడియాకు పోజుల కోసమే ఈ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించేవారు. మరికొన్ని చోట్ల అటెండెన్స్ కోసమే ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు హాజరయ్యేవారు. బాదుడే బాదుడు కార్యక్రమంపై సర్వే చేసిన టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీకి దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గంలో కూడా ఏ గ్రేడ్ సాధించలేదట. A-గ్రేడ్ లో 0, B-గ్రేడ్ లో 9, C-గ్రేడ్ లో 80, D-గ్రేడ్ లో 86 నియోజకవర్గాలు నిలిచాయి.

మంగళగిరి బాటలో కుప్పం
చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, లోకేష్ పోటీ చేసి ఓడిపోయిన మంగళగిరి కూడా A-గ్రేడ్‌లో నిలవలేకపోయింది. తండ్రీ కొడుకుల నియోజకవర్గాలు కూడా C గ్రేడులో నిలిచాయి. దీంతో, ఇక బాదుడే బాదుడు కార్యక్రమానికి స్వస్తి పలకాలని టీడీపీ నిర్ణయించుకుంది. ఈ నివేదికను బయటపెట్టింది తెలుగుదేశం ప్రత్యర్థులు కాదు.. స్వయంగా టీడీపీ ప్రోగ్రామింగ్ కమిటీలో పని చేసే స్వాతి. ఆమె.. టీడీపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు సమక్షంలో బయట పెట్టింది. ప్రభుత్వంపై వ్యతిరేకత లేనపుడు.. టీడీపీ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేపట్టిన అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com

 

మరిన్ని వార్తలు