‘భవిత’తో భరోసా 

24 Aug, 2022 08:24 IST|Sakshi

ప్రత్యేకావసరాల పిల్లలకు ప్రత్యేక శిక్షణ, వైద్యం

పిల్లల్లో మెరుగుపడుతున్న నైపుణ్యాలు

భవిత కేంద్రాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం 

పెందుర్తి(విశాఖపట్నం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా..ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘ప్రత్యేకావస రాల’ పిల్లల భవిష్యత్‌కు భరోసా కలుగుతోంది. భవిత కేంద్రాల్లో ఆయా పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స ద్వారా వారి సహజసిద్ధమైన నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు. వారి పనులు వారే చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అయితే లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం..భవిత కేంద్రాలు ఉన్నట్లు తగిన ప్రచారం చేయకపోవడం వలన పిల్లలను తీర్చిదిద్దే అవకాశాలు చేజారుతున్నాయి. ఒక్క పెందుర్తిలోనే దాదాపు 200 మందికి పైగా లోపాలు కలిగిన పిల్లలు ఉండగా నియోజకవర్గంలో ఆ సంఖ్య వెయ్యికి పైమాటే..కానీ భవిత కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పిల్లల సంఖ్య కేవలం 70 మంది మాత్రమే. ప్రత్యేకావసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో సంప్రదించవచ్చు.  
 
లోపాలు ఇవీ..శిక్షణ ఇలా.. 
ముందుగా కేంద్రంలో చేరిన చిన్నారులను కొద్దిరోజుల పాటు నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా పరిశీలించి వారి లోపాలను గుర్తిస్తారు. 
దృష్టిలోపం ఉన్నవారికి దృష్టి ప్రేరణ, బ్రెయిలీ లిపిపై అవగాహన కలిగిస్తారు. 

వినికిడి సమస్య ఉన్నవారికి నాలుక అంగుడికి మధ్య ప్రేరణ కలిగేలా తర్ఫీదు ఇస్తారు. కొవ్వొత్తులు ఊదించడం..బెలూన్లు ఊదడం..ఐస్‌ క్రీం తినిపించడం వంటివి ఇందులో భాగం. దీంతోపాటు ప్రత్యేక పరికరం ద్వారా వారి వినికిడి సమస్యను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తారు. 
మానసిక సమస్యలు ఉన్న పిల్లలను ఏదైనా ఓ పని మీద ఆసక్తి కలిగేలా చేస్తారు. ఈ పిల్లల్లో త్వరగా మరిచిపోయే లక్షణం ఉంటుంది కనుక ఆ పని మీద ఆసక్తిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరచూ ఆటలను మారుస్తూ మానసిక స్థితిని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. 
లోపాలు గుర్తించి పిల్లలకు కేంద్రంలోనే శిక్షణ కాకుండా ఇంటి దగ్గర కూడా సాధన చేసే విదంగా భోదన చేస్తారు. తల్లిదండ్రులకు కూడా మెళకువలు నేర్పిస్తారు. 

పిల్లల లోపాలను బట్టి భవిత కేంద్రంలో కనీసం మూడు నెలలు గరిష్టంగా రెండేళ్లపాటు శిక్షణ, చికిత్స అందిస్తారు. 
పరిస్థితి మెరుగైనట్టు ఉంటే పిల్లలకు అందుబాటులో ఉండే పాఠశాలలో చేర్పించి సహిత విద్య అందించే ప్రయత్నం చేస్తారు. 

‘భవిత’లో ఇలా చేర్పించండి 
సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడల్లో భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 20 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు.  
నెలల చిన్నారి నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు అర్హులు.  
మిత వైకల్యం, అతి తక్కువ ఉన్న పిల్లలకు కేంద్రంలో ప్రతీరోజు శిక్షణ అందిస్తారు. తీవ్ర, అతి తీవ్ర వైకల్యం ఉన్నవారికి ఇంటి దగ్గరే తర్ఫీదు ఇస్తారు. లోపాలు ఉన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్, గైడెన్స్‌ ఇస్తారు. తద్వారా ఇంటి నిపుణులు లేని సమయంలో కూడా పిల్లలకు తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకుల భావన. 

అడ్మిషన్లు ఇస్తున్నాం 
భవిత కేంద్రాల్లో పిల్లల పరిస్థితికి అనుగుణంగా శిక్షణ, చికిత్స అందిస్తున్నాం. పిల్లలందరూ చక్కాగా స్పందిస్తున్నారు. కనీసం వారి పనులు వారు చేసుకునేలా తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. అయితే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడి కేంద్రంపై అవగాహన లేక బయట ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చేరే పిల్లలకు నిబంధనల ప్రకారం స్కాలర్‌షిప్‌/పింఛన్‌తో పాటు గార్డియన్‌కు బస్‌పాస్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం.  తమ పిల్లలను చేర్పించాలనుకునే వారు ఫోన్‌: 99122 39821 నంబర్లో సంప్రదించినా..కేంద్రానికి వచ్చినా అడ్మిషన్‌ ఇస్తాం. 
–ఎస్‌.శారద, భవిత కేంద్రం నిర్వాహకురాలు  

మరిన్ని వార్తలు