సంసారంలో ‘స్మార్ట్‌’ తిప్పలు.. అధ్యయనంలో షాకింగ్‌ వాస్తవాలు!

13 Dec, 2022 02:14 IST|Sakshi

సెల్‌ఫోన్ల మితిమీరిన వినియోగంతో సంబంధాలపై ప్రభావం

‘స్మార్ట్‌ఫోన్స్‌ అండ్‌ దెయిర్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ హ్యూమన్‌ రిలేషన్‌íÙప్స్‌–­2022’­అధ్యయనం వెల్లడి 

స్మార్ట్‌ఫోన్ల వినియోగంపై జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు 

సాక్షి, హైదరాబాద్‌:  స్మార్ట్‌ఫోన్ల మితిమీరిన వినియోగంతో తిప్పలు తప్పడం లేదు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మొబైళ్లను విచ్చలవిడిగా ఉపయోగించడంతో భార్యాభర్తలు, అతి సన్నిహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. అవసరమున్నా, లేకపోయినా సమయం, సందర్భం లేకుండా స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోవడం చాలా మందికి అలవాటు అయ్యింది. కొంతమందిలో వ్యసనంగా మారడంతో పరిణామాలు సమాజాన్ని కలవర పరుస్తున్నాయి. 

ఆధునిక సాంకేతికత ఒక వరంగా వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఎన్నో అవసరాలను తీరుస్తోంది. ఐతే ఈ టెక్నాలజీని మితిమీరి ఉపయోగిస్తే పెనుసమస్యగా మారుతోంది. మాన­వ సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ల అతి వినియోగం వల్ల వివాహిత జంటల సంబంధాల్లో, మానసికంగా చూపుతున్న ప్రభావం, స్వభావంలో వస్తున్న మార్పులపై ‘స్మార్ట్‌ఫోన్స్‌ అండ్‌ దెయిర్‌ ఇంపాక్ట్‌ ఆన్‌ హ్యూమన్‌ రిలేషన్‌షిప్స్‌–2022’అనే అంశంపై వీవో–సైబర్‌ మీడియా పరిశోధన చేసింది. అందులో వెల్లడైన ఆసక్తికరమైన విషయాలను ఫోర్త్‌ ఎడిషన్‌ ఆఫ్‌ స్విచ్ఛాఫ్‌ స్టడీలో వెలువరించింది. 

హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పుణేలలోని స్మార్ట్‌ఫోన్ల వినియోగదారులపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఫోన్‌ వాడకంలో వస్తున్న ట్రెండ్స్, అతి వినియోగంతో వస్తున్న మార్పులను విశ్లేషించింది. జెండర్‌తో సంబంధం లేకుండా భర్త/భార్య సగటున రోజుకు 4.7గంటలు స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నా­రు. తమతో కాకుండా ఫోన్‌తో గడుపుతున్నారంటూ తమ జీవిత భాగస్వామి తరచూ ఫిర్యాదు చేస్తుం­టారని 73శాతం మంది అంగీకరించారు. ఇంకా మరెన్నో విషయా­లను అధ్య­యనం వెల్లడించింది.  

రిపోర్టులోని ముఖ్యాంశాలు
- అవకాశమున్నా కూడా తమ భార్య/భర్తతో కాకుండా ఎక్కువ సమయం మొబైళ్లతోనే సమయం గడుపుతున్నామన్న 89% మంది.
- స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోయి కొన్నిసార్లు తమ చుట్టూ పరిసరాలనూ మరిచిపోయామన్న 72 శాతం మంది.
- తమ వారితో సమయం గడుపుతున్నపుడు కూడా ఫోన్లను చూస్తున్నామన్న 67% మంది. 
- స్మార్ట్‌ఫోన్ల మితిమీరి వినియోగం వల్ల తమ భాగస్వాములతో సంబంధాలు బలహీనపడినట్టు 66 శాతం మంది అంగీకారం. 
- అతిగా ఫోన్‌ వాడకంతో మానసికమైన మార్పులు వస్తున్నాయని, స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నప్పుడు భార్య కలగజేసుకుంటే ఆవేశానికి లోనవుతున్నామన్న 70 శాతం  
- ఫోన్‌ కారణంగా భార్యతో మాట్లాడుతున్నపుడు కూడా మనసు లగ్నం చేయలేకపోతున్నామన్న 69 శాతం మంది.
- భోజనం చేస్తున్నపుడు కూడా ఫోన్లను ఉపయోగిస్తున్నామన్న 58 శాతం మంది.
- లివింగ్‌రూమ్‌లో స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తున్న వారు 60 శాతం  
- రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ఫోన్లు చూస్తున్నవారు 86 శాతం  
- జీవితంలో ఒకభాగమై పోయిన స్మార్ట్‌ఫోన్లను వేరు చేయలేమన్న 84 శాతం  
-  తీరిక సమయం దొరికితే చాలు 89% మంది ఫోన్లలో మునిగిపోతున్నారు  
- రిలాక్స్‌ కావడానికి కూడా మొబైళ్లనే సాధనంగా 90% మంది ఎంచుకుంటున్నారు. 

స్క్రీన్‌టైమ్‌పై స్వీయ నియంత్రణ అవసరం..
ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆకర్షణకు లోనయ్యే, గంటలు గంటలు అందులోనే మునిగేపోయేలా చేసే గుణం స్మార్ట్‌ ఫోన్లలో ఉంది. అది ‘అటెన్షెన్‌ సీకింగ్‌ డివైస్‌’కావడంతో బయటకెళ్లినా, ఇంట్లో ఉన్నా పది నిమిషాలు కాకుండానే మొబైళ్లను చెక్‌ చేస్తుంటాం. వాడకపోతే కొంపలు మునిగేదేమీ లేకపోయినా అదో వ్యసనంగా మారింది. బహిరంగ ప్రదేశాల్లోనూ తాము బిజీగా ఉన్నామని చూపెట్టేందుకు సెల్‌ఫోన్లు ఉపయోగిస్తుంటారు. ఆఫీసుల నుంచి ఇంటికి వచ్చాక అత్యవసరమైతే తప్ప మొబైళ్లు ఉపయోగించరాదనే నిబంధన వివాహితులు పెట్టుకోవాలి. బెడ్‌రూమ్‌లో ఫోన్లు వినియోగించరాదనే నియమం ఉండాలి. రోజుకు ఇన్ని గంటలు మాత్రమే సెల్‌ఫోన్‌ వాడాలనే నిబంధన పెట్టుకోవాలి. ఉపవాసం మాదిరిగా వారానికి ఒకరోజు అత్యవసరమైతే తప్ప ఫోన్‌ ఉపయోగించకుండా చూసుకోవాలి. మొబైల్‌ అధిక వినియోగ ప్రభావం తమ జీవితాలపై, సంబంధాలపై ఏ మేరకు పడుతోందనే జ్ఞానోదయమైతే ఈ సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.  
– సి.వీరేందర్, సీనియర్‌ సైకాలజిస్ట్‌ .

మరిన్ని వార్తలు