HBD Jr. NTR: రోరింగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ జైత్రయాత్ర

20 May, 2022 12:34 IST|Sakshi

నందమూరి వంశ నట వారసుడు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ ట్రిపుల్‌ ఆర్‌ మూవీతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు. బాలనటుడిగా తెరంగేట్రం చేసి, తారక్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన నటనా ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగి టాలీవుడ్‌  టాప్‌  హీరోగా  దూసుకుపోతున్నాడు.  మే 20న బర్త్‌డే సందర్భంగా... ఆర్‌ఆర్‌ఆర్‌తో ట్రెండింగ్‌ స్టార్‌గా మారిపోయిన ఎన్టీఆర్‌ సిల్వర్ స్క్రీన్ జర్నీ పై ఓ లుక్కేద్దాం!

అలనాటి అందాల హీరో,  దివంగత నందమూరి తారక రామారావు మనవడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌ టాలీవుడ్ టాప్ స్టార్‌గా, యంగ్ టైగర్‌గా కాదు.. కాదు. రోరింగ్‌  టైగర్‌గా టాప్‌ స్థాయికి చేరుకున్న ఆయన సినీ కరియర్‌ చాలా అద్భుతమైందని చెప్పాలి. నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు 1983, మే 20న పుట్టాడు ఎన్టీఆర్‌. బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాలనటుడుగా తెరంగేట్రం చేసినా, 1996లో బాల రామాయణంలో  రాముడిగా అద్భుతంగా నటించి అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. ఈ మూవీకిగాను నంది స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకుని పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చాటి చెప్పాడు. 

2001లో 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కరియర్‌లో ఎన్ని ఒడి దుడుకులొచ్చినా  ధైర్యంగా ముందుకే సాగాడు. వరుస సినిమాలు, హిట్స్‌తో అటు విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను, ఇటు విమర్శకుల ప్రశంసలను దక్కించుకున్నాడు. చిన్నతనంలోనే కూచిపూడి నాట్యం నేర్చుకోవడంతో డాన్స్‌లో ఇరగదీయడం ఎన్టీఆర్‌కు ప్లస్‌ పాయింట్‌.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1' మూవీ ఎన్టీఆర్‌కు సూపర్‌ సక్సెస్‌ను అందించింది. తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన  ఆది సినిమాతో ఆ  హంగామా కొనసాగింది. డాన్స్‌లు, ఫైట్స్‌,  డైలాగ్స్‌తో  మాస్ ఆడియన్స్‌ని అట్రాక్ట్  చేశాడు. అలా అంచెలంచెలుగా  ఎదుగుతూ  స్టార్‌ హీరో ఇమేజ్‌  సొంతం చేసుకున్నాడు. 

అల్లరి రాముడు  మూవీ నిరాశపర్చినా వెంటనే సింహాద్రి మూవీతో బ్లాక్‌ బస్టర్‌ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మూవీతో  ఎన్టీఆర్‌ కరియర్‌ టర్న్‌ తిరిగినప్పటికీ, ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద  పెద్దగా రాణించలేదు. కానీ రాఖీ చిత్రంతో అమ్మాయిల మనసు దోచుకున్నాడు. ఈ మూవీలోని డైలాగులు, నటన విమర్శకుల ప్రశంశలందుకుంది. అంతేకాదు అప్పటిదాకా బొద్దుగా ఉన్న ఎన్టీఆర్‌ ట్రెండ్‌కి తగ్గట్టుగా తనను తాను మలుచుకున్నాడు.  అనూహ్యంగా  బాగా సన్నబడి  విమర్శలను తిప్పికొట్టాడు. అలా 2007లో రాజమౌళి  డైరెక్షన్‌లో వచ్చిన  యమదొంగ చిత్రంతో హిట్‌  కొట్టాడు.

2008లో వచ్చిన కంత్రి వసూళ్ల విషయంలో దెబ్బకొట్టింది. 2010లో అదుర్స్, బృందావనం మూవీలు బాక్స్‌ ఆఫీసు వద్ద భారీ వసూళ్లను సాధించాయి. అదుర్స్‌ మూవీ ప్రారంభంలో కొన్ని వివాదాలు ఎదురైనా ఈ మూవీలోని  డైలాగులు ఇప్పటికీ  ఎవర్‌ గ్రీన్‌. ఇంకా శక్తి, ఊసరవెల్లి , దమ్ము, రామయ్యా వస్తావయ్యా, రభస చిత్రాలు సో..సో..గానే నడిచాయి. బాద్‌షా  పరవా లేదనిపించింది. అయితే నాన్నకు ప్రేమతో మరోసారి భారీ హిట్‌ తన ఖతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్‌. జనతా గ్యారేజ్, లవకుశ అరవింద సమేత వీర రాఘవ సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి. అటు బుల్లితెరపై "బిగ్ బాస్"షో  హోస్ట్‌గా  తన విశ్వరూపాన్ని చూపించాడు. 

ఇక మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్యాన్‌ ఇండియా మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్‌ ఆర్‌ రికార్డు కలెక్షన్లను రాబట్టింది. రాజమౌళి, రాంచరణ్‌, తారక్ కాంబోలో తెరకెక్కిన ఈ మూవీలో కొమురంభీంగా తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. నాటు నాటు పాటలోని ఎన్టీఆర్‌ డ్యాన్స్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు స్టెప్పులేశారు. ఇంటర్నేషనల్ మీడియా కూడా ఫిదా అయిపోయింది. 

మరోవైపు కరోనా సంక్షోభం,ఆంక్షల నేపథ్యంలో గత రెండేళ్లుగా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరగలేదు. దీనికి తోడు ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా నేపథ్యంలో తమ అభిమాన హీరో బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే సీడీపీని ఆవిష్కరించడం విశేషం. అలాగే ఎన్టీఆర్‌ బర్త్‌డే సందర్భంగా ఫ్యూచర్‌  ప్రాజెక్టుపై అప్‌డేట్స్‌పై ఫ్యాన్స్‌ హంగామా చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు