ఆశ్చర్యం! కాకతీయ వారసులకు సమ్మక్క సారే

25 Feb, 2022 16:43 IST|Sakshi

కాకతీయుల రాజులతో పోరాడి అమరులై ఆ తర్వాత దైవత్వం సాధించుకున్న వీర వనితలుగా సమ్మక్క సారలమ్మలకు పేరుగాంచారు. వారి వీరత్వం, త్యాగాలకు స్మరిస్తూ ప్రతీఏడు జాతర జరుపుకోవడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గతాన్ని పక్కన పెట్టి కొత్త సంబంధాలకు తెర తీశారు సమ్మక్క పూజారులు. కాకతీయు వారసులకు సమ్మక్క తరఫున సారెను పంపారు.

ప్రతాపరుద్రుడి మరణంతో వరంగల్‌ కేంద్రంగా కొనసాగిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అయితే ప్రతాపరుద్రుడి కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహాస ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నారు. కాకతీయ వారసుడిగా అన్నమదేవ్‌ జగదల్‌పూర్‌ కేంద్రంగా కొత్త సామ్ర్యాజ్యం స్థాపించాడు. బ్రిటీష్‌ వారి చారిత్రక పరిశోధనల్లోనూ అన్నమదేవ్‌ కాకతీయ వారసుడిగా తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్‌ పరంపరలో చంద్రదేవ్‌భంజ్‌ కొనసాగుతున్నారు. రాజరికం అంతరించినా.. జగ్‌దల్‌పూర్‌ కోటలో ఉంటూ స్థానిక పండుగుల్లో గత సంప్రదాయాలను, వైభవాలను కొనసాగిస్తున్నారు. 

ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16న మొదలైన జాతర ఫిబ్రవరి 23న తిరుగు వారం పండుగతో ముగిసింది. జాతర ముగిసిన తర్వాత సమ్మక్క పూజారులుగా చెప్పుకునే సిద్ధబోయిన వంశస్తులు కాకతీయ వారుసుడైన చంద్రదేవ్‌భంజ్‌కి సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను పంపించారు. వందల ఏళ్ల క్రితమే ఉన్న బంధాన్ని మరోసారి తట్టి లేపారు. 

మేడారం జాతర, బస్తర్‌ దసరా వేడుకలపై పరిశోధనలు చేస్తున్న టార్చ్‌ సంస్థ కన్వీనర్‌ అరవింద్‌ పకిడె ద్వారా ఈ సారేను సమ్మక్క పూజారులు పంపించారు. తిరుగువారం పండుగ ముగిసిన వెంటనే వీటిని తీసుకుని టార్చ్‌ బృందం జగదల్‌పూర్‌ వెళ్లింది. కాగా ఫిబ్రవరి 25 శుక్రవారం రాజమాత కృష్ణకుమారి దేవికి ఈ సారెను సమ్మక్క తరఫున అందించారు.  

పరిశోధనలు జరగాలి - సిద్ధబోయిన అరుణ్‌కుమార్‌ (సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు)
కాకతీయ రాజులు, సమ్మక్క కుటుంబీల మధ్య ఉన్న సంబంధాలు నెలకొన్న వివాదాలపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై విస్తారమైన పరిశోధనలు జరగలేదు. పైపై విషయాలకే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ఆనాదిగా దండకారణ్యంతో ఆదివాసీలకు వారిలో ఒకరైన సమ్మక్క ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయి. మా పూర్వీకులు మాకు అదే విషయం చెప్పారు. మరోవైపు కాకతీయ రాజులకు దండకారణ్యంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో కాకతీయ వారసులకు సారెను పంపి కొత్త బంధవ్యాలకు తెర తీశాం. వచ్చే జాతరకు వారిని ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తున్నాం.

మహిళా శక్తికి ప్రతిరూపం - చంద్రదేవ్‌భంజ్‌ (కాకతీయుల వారసుడు)
వీర నారీమణి, త్యాగానికి మరోపేరైన సమ్మక్క సారేను మా కుటుంబం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఉంటుంది. ఆనాదిగా మేము స్త్రీలను శ​క్తి స్వరూపాలుగా చూస్తున్నాం. సమ్మక్కను ఇక్కడ సడువలిగా కొలుస్తారు. ఇక్కడే దంతేశ్వరి ఆలయం కూడా ఉంది. వరంగల్‌ - దండకారణ్యంల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సారెతో అవి మరింత బలపడనున్నాయి. 
 

>
మరిన్ని వార్తలు