టుటన్‌ఖమున్‌ మిస్టరీ అంతకు మించి! సవతి తల్లిని పాతిపెట్టాడు సరే.. ఆ ‘మమ్మీ’ ఎక్కడ?

26 Sep, 2022 19:33 IST|Sakshi

అంతుచిక్కని విషయాలపైన ఆసక్తి నెలకొనడం సహజమే!. అలాంటి జాబితాలో ప్రముఖంగా నిలిచేది టుటన్‌ఖమున్‌ సమాధి మిస్టరీ. ప్రాచీన ఈజిప్ట్‌ రాజు సమాధిగా, పాఠ్యపుస్తకాల్లో కర్స్‌ ఆఫ్‌ టుటన్‌ఖామున్‌గా ఇది ఎంతో ఫేమస్‌. ఈ సమాధిని తవ్వి బయటకు తీసిన తర్వాతే ఎన్నో చిత్ర-విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి చుట్టూరా ఎన్నో కథలు, మరెన్నో ప్రచారాలు పుట్టుకొచ్చాయి. అదే సమయంలో ఈ సమాధి ఆధారంగా ఆసక్తికర విషయాలను కనుగొంటున్నారు చరిత్రకారులు. 

సరిగ్గా వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సమాధి.. టుటంఖమన్ సమాధి అనేది చరిత్రకారులు చెప్పేమాట. కేవలం పదకొండేళ్లకు ఈజిప్ట్‌ ఫారోగా(చక్రవర్తి) బాధ్యతలు స్వీకరించిన టుటన్‌ఖమున్‌.. పంతొమ్మిదేళ్లకే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు(పరిశోధనల ఆధారంగా నిర్ధారణ). అతనెలా చనిపోయాడన్న విషయం.. ఇప్పటికీ మిస్టరీనే!. అయితే ఈ సమాధి మాత్రం ఎన్నో అంతుచిక్కని రహస్యాలను చేధించేందుకు పరిశోధకులకు, చరిత్రకారులకు ఒక అవకాశం ఇచ్చింది.   

► సమాధిలో కుర్చీలు, రథాలు, ఖజానాలు, ఇతర విలాస వస్తువులు ఉంచారు. బంగారుమయమైన ఆ సమాధిలో ఊహించినదానికంటే ఎన్నో రెట్ల రహస్యాలు దాగి ఉండొచ్చని చరిత్రకారులు ఒక అంచనాకి వచ్చారు. 


 
► టుటన్‌ఖమున్(టుటన్‌ఖాటెన్) క్రీస్తుపూర్వం 1341లో పుట్టిఉంటాడనే ఒక అంచనా ఉంది. ఈజిప్షియన్‌ భాష ప్రకారం.. గాలి, సూర్యుడి కలయిక పేరే టుటన్‌ఖమున్‌. చిన్నవయసులోనే శక్తివంతమైన రాజుగా అతనికి పేరు దక్కింది. కానీ, ఆ పేరుప్రఖ్యాత్యుల వల్లే అతన్ని హత్య చేసి ఉంటారని భావిస్తుండగా.. అతని చావుకి సవతి తల్లి నెఫెర్టిటికి ఏదో కనెక్షన్‌ ఉండి ఉంటుందని భావిస్తుంటారు చరిత్రకారులు. 

► 1922లో హోవార్డ్ కార్టర్ ఈజిప్ట్‌ ఫారో టుటన్‌ఖమున్ సమాధి కనిపెట్టాడు.  అయితే ఈ సమాధిని తాకిన వాళ్లు, చివరికి కథనాలు రాసిన వాళ్లు సైతం అనుమానాస్పద రీతిలో చనిపోవడం, ఏదో ఒక ప్రమాదానికి గురికావడంతో శపించబడ్డ సమాధిగా పేర్కొంటూ చాలా కాలంపాటు దాని జోలికి వెళ్లలేదు చరిత్రకారులు. అయితే.. 

► కాలక్రమంలో దీనిపై పరిశోధనలు మళ్లీ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఇప్పటివరకు కనుగొన్న ఫారోల సమాధుల్లో ఇదే చిన్నది కావడం!. దీంతో టుటన్‌ఖమూన్‌ నిజంగా ఫారోనేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ మిస్టరీకి సంబంధించిన ఆధారాలు దొరికాయింటూ తాజాగా బ్రిటీష్‌ ఈజిప్టాలజిస్టులు ముందుకు వచ్చారు. 

► నెఫెర్టిటి.. అఖేనటెన్‌ భార్య. టుటన్‌ఖమున్‌కు సవతి తల్లి. టుటన్‌ఖమున్‌ కంటే ముందు ఈజిప్ట్‌ను పాలించింది. కానీ, ఆమె సమాధి మాత్రం ఎక్కడుందో ఇప్పటిదాకా తెలియలేదు.  

► ప్రపంచంలో ఈజిప్ట్‌ నాగరికత మూలాలున్న ప్రతీచోటా తవ్వకాలు జరిపినా లాభం లేకుండా పోయింది. 18 ఈజిప్ట్‌ రాజకుటుంబాలకు చెందిన మమ్మీలకు డీఎన్‌ఏ టెస్టులు జరిపినా ఆ సమాధి దొరకలేదు. అయితే, నెఫెర్టిటి సమాధి వివరాలకు సంబంధించిన ఆధారం.. టుటన్‌ఖమున్‌ సమాధిలోనే దాగి ఉన్నాయని వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

► టుటన్‌ఖమున్ సమాధి పక్కనే రహస్య చాంబర్‌లో నెఫెర్టిటి సమాధి ఉండవచ్చని చాలా కాలం నుంచి కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే.. అసలు టుటన్‌ఖమున్‌ సమాధినే.. నెఫెర్టిటి సమాధిలో భద్రపరిచారనే వాదనను ఇప్పుడు తెర మీదకు వచ్చింది.

► టుటన్‌ఖమున్‌ను అతని తర్వాతి పాలకుడు ఫారో అయ్ సమాధి చేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాల కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయని బ్రిటిష్‌ మ్యూజియం క్యూరేటర్‌గా గతంలో పని చేసిన నికోలస్‌ రీవ్స్‌ చెప్తున్నారు. ఆ చిత్రాల కింద.. నెఫెర్టిటిని టుటన్‌ఖమున్‌ సమాధి చేస్తున్న చిత్రాలు ఉన్నాయని రీవ్స్‌ చెప్తున్నాడు. ఆ తర్వాతి చిత్రాలు మమ్మీ నోరు తెరిచే కార్యక్రమం(మరణించిన వ్యక్తి ఐదు ఇంద్రియాలను పునరుద్ధరించడానికి) గురించి వివరిస్తున్నాయని పేర్కొన్నారు. 

► ఎలాగైతే.. ఫారో అయ్ సమాధికి చేసిన డిజైన్‌ల కింద టుటన్‌ఖమున్ గురించిన వివరాలు ఉన్నాయో. అలాగే.. టుటన్‌ఖమున్‌ సమాధిలో నెఫెర్టిటి సమాధికి సంబంధించిన వివరాలు దాగి ఉన్నాయన్నది రీవ్స్‌ చెప్తున్న మాట.

తన సవతి తల్లి నెఫెర్టిటి అంటే టుటన్‌ఖమున్‌కు అమితమైన ప్రేమ అయినా ఉండాలి. లేదంటే.. ద్వేషమైనా ఉండాలి. అందుకే ఆమె సమాధి ఎవరికీ చిక్కకుండా రహస్యంగా టుటన్‌ఖమున్‌ దాచి ఉంటాడనే భావిస్తున్నారు రీవ్స్‌. మరోవైపు అత్యంత శక్తివంతమైన రాణిగా నెఫెర్టిటి చరిత్రకు ఎక్కడంతో.. ఆమె సమాధిని ప్రత్యేక పరిస్థితుల్లో ఖననం చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు.

► టుటన్‌ఖమున్‌ సమాధి మిగతా ఫారోలా కంటే భిన్నంగా ఉంటుంది. పైగా ఆ చాంబర్‌లోని డెకరేషన్ గోడపై మార్పులు ఉండడంతో.. అందులో రహస్య ఛాంబర్‌ ఉండొచ్చని, అందులోనే ఆమె సమాధిని దాచి ఉండొచ్చని ఆయన చెప్తున్నారు.

► అయితే.. టుటన్‌ఖమున్‌ సమాధి గురించి ఇలాంటి వాదనలు,రాతలు చాలా చేయొచ్చని అంటున్న రీవ్స్‌.. ఒకవేళ తన వాదనే నిజమైతే ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టుల అన్వేషణకు ఒక సమాధానం దొరకవచ్చని భావిస్తున్నారాయన.

మరిన్ని వార్తలు