300,00,00,000 మందికి మంచి తిండి కరువు.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

15 Nov, 2022 20:56 IST|Sakshi

- కంచర్ల యాదగిరిరెడ్డి 

తిండి కలిగితే కండగలదోయ్‌... 
కండ కలవాడేను మనిషోయ్‌..
అని మహాకవి ఎప్పుడో చెప్పాడు. 

కానీ ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. కొద్దోగొప్పో అందరూ తిండి తినడమైతే తింటున్నారు కానీ, ఈ భూమి మీద సుమారు 300 కోట్ల మంది ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారానికి దూరంగా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి (ఐరాస) సంస్థ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏఓ) ఈ విషయాన్ని స్పష్టం చేయడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 138 దేశాల సమాచారాన్ని ఈ సంస్థ విశ్లేషించింది. తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికల్లా భూమ్మీద ఆకలన్నది లేకుండా చేయాలని ఎఫ్‌ఏఓ తీర్మానం చేసుకుంది. అయితే ఏటేటా ఆరోగ్యకరమైన తిండికి దూరమవుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

ఏడాదిలో11.2 కోట్ల పెరుగుదల
తిండి లేని పేదల గురించి తరచూ వార్తలు వస్తుంటాయి కానీ, తిన్న తిండితో ఆరోగ్యంగా ఉండలేని వారి గురించి తెలిసింది తక్కువే. ఈ క్రమంలోనే ఎఫ్‌ఏఓ ప్రతి దేశంలో ఆరోగ్యకరమైన తిండి తినగలిగిన వాళ్లు ఎంతమంది? అసలు ఆరోగ్యకరమైన తిండి అంటే ఏమిటన్నది తెలుసుకుని వివరాలు వెల్లడించింది. దీని ప్రకారం 2020లో ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేని వారి సంఖ్య 300 కోట్లు.

2019 గణాంకాలతో పోలిస్తే 11.2 కోట్లు ఎక్కువ. దీనికి ప్రధాన కారణం ఆహారపు ధరలు పెరగడమేనని సంస్థ చెపుతోంది. ఈ మేరకు ఆదాయం పెరగకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించింది. దీని ప్రభావం ధనిక దేశాలపై కాకుండా, ఆహార ద్రవ్యోల్బణం అదుపు తప్పడం ద్వారా పేద దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తుందని తేల్చి చెప్పింది. 

శక్తి అవసరాలను తీర్చగలగాలి
ఒక మనిషి రోజువారీ శక్తి అవసరాలను తీర్చగలిగేదే ఆరోగ్యకరమైన ఆహారమని ఎఫ్‌ఏఓ నిర్వచిస్తోంది. అలాగే ఆయా దేశాల్లో నిర్వచించుకున్న పౌష్టికాహార మార్గదర్శకాలనూ సంతృప్తి పరచాలి. ఉదాహరణకు భారత్‌లో ప్రతి ఒక్కరు రోజుకు కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తినడం అవసరమని జాతీయ పోషకాహార సంస్థ పేర్కొంటోంది. చాలామంది ఈ స్థాయిలో వీటిని తీసుకోవడం లేదు. పైగా ఈ మోతాదుల్లో కాయగూరలు, పండ్లు తీసుకునే స్థోమత కూడా కొందరికి ఉండదు. ఒక కుటుంబం రోజువారీ ఆదాయంలో 52% లేదా అంతకంటే ఎక్కువను ఆహారానికి వెచి్చంచాల్సిన పరి స్థితి ఉంటే, దాన్ని స్థోమతకు మించిందిగా ఎఫ్‌ఏఓ చెపుతోంది.

ఆఫ్రికాలోనే సగం దేశాలు 
సర్వే చేసిన 138 దేశాల్లో కనీసం 52 దేశాల జనాభాలో సగం మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేదని ఎఫ్‌ఏఓ సర్వే వెల్లడించింది. ఇందులో అత్యధికం ఆఫ్రికా ఖండంలో ఉండగా మిగిలినవి ఆసియా, ఓషియానా, ఉత్తర, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉన్నాయి. ఆహార కొరత అన్నది ఆఫ్రికా ఖండంలో ఎప్పుడూ సమస్యే కానీ, సహారా ఎడారి పరిసర దేశాల్లోని జనాభాలో 90 శాతం మందిలో ఈ సమస్య కనిపిస్తుండటం ఆందోళన కలిగించే అంశం.

కరువు ప్రాంతాల్లో మూడింట ఒక వంతు ఇక్కడే ఉండటం, వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉండటం వల్ల ఆహార ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురవుతుండటం ఈ పరిస్థితికి కారణమని ఎఫ్‌ఏఓ విశ్లేషించింది. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పుణ్యమా అని ఇప్పుడు ఆఫ్రికా దేశాలకు గోధుమ దిగుమతులు సగం కంటే ఎక్కువ పడిపోయాయి. ఫలితంగా చాలా దేశాల్లో ఆహార ద్రవ్యోల్బణం అధికమైంది. సమస్యను మరింత జటిలం చేసింది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత లేని వారు ఒక్క భారత దేశంలోనే 97.3 కోట్ల మంది ఉన్నట్లు ఎఫ్‌ఏఓ దగ్గర ఉన్న సమాచారం చెపుతోంది.

ఆసియా మొత్తం మీద 189 కోట్లు, ఆఫ్రికాలో సుమారు 100 కోట్ల మంది ఉన్నారు. అమెరికా, ఓషియానాల్లో సుమారు 15.1 కోట్ల మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఆజర్‌బైజాన్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో మాత్రమే జనాభా మొత్తం పుష్టికరమైన ఆహారాన్ని కొనుక్కోగల స్థితిలో ఉన్నట్లు ఆ సర్వే నివేదిక తెలిపింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరోపియన్‌ దేశాల్లో 95 శాతం ప్రజలు కూడా మంచి స్థితిలోనే ఉన్నారు. 

పెరుగుతున్న జనాభా కూడా కారణమే
ఆరోగ్యకరమైన ఆహారం అందుకునే స్థోమత లేకపోవడానికి పెరుగుతున్న జనాభా కూడా ఒక కారణం. ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనుంది. 2050 నాటికి ఇది ఇంకో 35 శాతం పెరగనుంది. అంటే సుమారు 250 కోట్ల మందికి అదనంగా ఆహారం అవసరం. ఈ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పంట దిగుబడులు ఇప్పుడున్న స్థాయికి రెట్టింపు కావాలి’అని యునైటెడ్‌ నేషన్స్‌ తరఫున అధ్యయనంలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్‌ వర్సిటీ ఎకనామిక్స్‌ విభాగం హెడ్‌ అబ్రమిస్కీ అన్నారు. పెరిగిపోతున్న జనాభాకు తగినంత ఆహారం పండించాలన్నా, పండించిన ఆహారం ప్రజల కడుపులు నింపడం మాత్రమే కాకుండా తగిన పుష్టిని ఇవ్వాలన్నా పలు రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు అవసరమని పేర్కొంటూ యూఎన్‌కు ఆయన ఓ నివేదిక కూడా అందజేశారు.  

‘ఆహార వృథాను తగ్గించాలి’
ఆహార వృథాను వీలైనంత వరకూ తగ్గించడం. పండిన పంట వినియోగదారుడి చేతికి చేరేలోపు జరుగుతున్న వృథాను గణనీయంగా తగ్గించడం ద్వారా ఉన్న ఆహారాన్ని ఎక్కువమందికి చేరేలా చేయవచ్చునని ఐరాస ఇటీవల తన సభ్యదేశాలకు సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకోగల రీతిలో కొత్త కొత్త వంగడాల సృష్టి, ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే భవిష్యత్తు ఆహార సవాళ్లను ఎదుర్కోగలమని నిపుణులు అంటున్నారు.  

పరిస్థితిని దిగజార్చిన కోవిడ్‌ 
ఆకలి కారణంగా 2018లో ఐదేళ్లు నిండకుండానే మరణించిన పిల్లల సంఖ్య 53 లక్షలు. 2020లో విడుదలైన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ఈ విషయం చెపుతోంది. 

 ► ఐక్యరాజ్య సమితి నిర్దేశించినసుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండోది‘జీరో హంగర్‌’. 2030 నాటికి ఆకలిని చెరిపేసేందుకు చేసుకున్న తీర్మానం ఇది. 
 ► కోవిడ్‌ మహమ్మారి పుణ్యమా అని ప్రపంచమిప్పుడు ‘జీరో హంగర్‌’లక్ష్యాన్ని అందుకోలేని స్థితిలో ఉంది. ఒకపక్క వాతావరణ సమస్యలు సవాళ్లు విసురుతుండగా, కోవిడ్‌ పరిస్థితిని మరింత దిగజార్చింది. సమాజంలోని అసమానతలను ఎక్కువ చేయడం ద్వారా మరింత మంది ఆకలి కోరల్లో చిక్కుకునేలా చేసింది.  
 ►ప్రపంచం మొత్తమ్మీద ఏటా 400 కోట్ల టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 33 శాతం వృథా అవుతోంది. దీని విలువ ఏకంగా 60 లక్షల కోట్ల రూపాయలు. అభివృద్ధి చెందిన దేశాల్లో తినే ఆహారం ఎక్కువగా వృథా అవుతుండగా, అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో పంటనష్టాలు ఎక్కువ.   

డిమాండ్‌కు తగ్గ ఆహారం కోసం.. 
ఆకలిని ఎదుర్కొనేందుకు మన దేశంలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే అనేక పథకాలు ఆచరణలో ఉన్నాయి. వాటిలో కొన్ని.. 

1.నేషనల్‌ న్యూట్రిషన్‌ మిషన్‌: పోషణ్‌ అభియాన్‌ అని పిలిచే ఈ పథకాన్ని 2018లో మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లో పోషకాహార లోపాలను తగ్గించడం, రక్తహీనత, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడాన్ని నివారించడం ఈ పథకం ఉద్దేశం

2. జాతీయ ఆహార భద్రత పథకం: 2007లో నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ కౌన్సిల్‌ ప్రారంభించిన పథకం ఇది. 11వ పంచవర్ష ప్రణాళిక ముగిసే సమయానికి దేశంలో వరి ఉత్పత్తి రెండు కోట్ల టన్నులు అధిమించగా, గోధుమల ఉత్పత్తి 80 లక్షల టన్నులకు చేరుకుంది. కాయధాన్యాల దిగుబడి 20 లక్షల టన్నుల పైచిలుకుకు చేరుకుంది. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ లక్ష్యానికి మించి దిగుబడులు సాధించాం. భవిష్యత్తులోనూ డిమాండ్‌కు తగ్గ ఆహారాన్ని పండించేందుకు నేషనల్‌ ఫుడ్‌ సెక్యూరిటీ మిషన్‌ పలు వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తోంది.  

3. రెండేళ్ల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాలను తగ్గించేందుకు, ఏడాది పొడవునా మంచి ఆహారం అందరికీ అందుబాటులో ఉండేలా చేసేందుకు ప్రభుత్వం జీరో హంగర్‌ పేరుతో ఇంకో పథకాన్ని అమలు చేస్తోంది. పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఆహారానికి పోషకాలు జోడించడం కూడా ప్రభుత్వ ప్రయత్నాల్లో ఒకటి. 

మరిన్ని వార్తలు