UP Exit Polls 2022: యూపీలో ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?

7 Mar, 2022 18:47 IST|Sakshi

అధికారం నిలుపుకోనున్న బీజేపీ

ప్రతిపక్షంలోనే సమాజ్‌వాదీ పార్టీ

పీపుల్స్‌ పల్స్‌ పోస్ట్‌ పోల్‌ సర్వే

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. బీజేపీ, మిత్రపక్షాలతో కలిసి 220 నుంచి 240 వరకు సీట్లు సాధిస్తుందని పోస్ట్‌ పోల్‌ సర్వే తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ దాని మిత్రపక్షాలకు కలిపి 140 నుంచి 160 స్థానాలు వస్తాయని పేర్కొంది. బహుజన సమాజ్‌వాదీ పార్టీ 12 నుంచి 18 సీట్లు గెలిచే అవకాశముంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ 8 నుంచి 12 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా కట్టింది. కాంగ్రెస్‌ పార్టీ 6 నుంచి 10 స్థానాలకు పరిమితం కానుంది. 

బీజేపీకి భారీగా తగ్గనున్న సీట్లు
గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి బీజేపీ 90 సీట్లు కోల్పోయే అవకాశముందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్లో బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమాజ్ వాదీ పార్టీని మరోసారి ప్రతిపక్షంలోనే కూర్చునే అవకాశముంది. అయితే గతంతో పోలిస్తే దాని బలం 300 శాతం వరకు పెరుగుతుందని అంచనా. యూపీ ఎన్నికల్లో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలు హోరాహోరీ తలపడినట్టు కనబడుతున్నా.. క్షేత్రస్థాయిలో చూసుకుంటే బీఎస్‌పీ కూడా బలమైన ఉనికిని కలిగి ఉంది. 

సీఎంగా మళ్లీ ఆయనే కావాలి..
ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్య్‌నాధ్‌పై ఎక్కువ మంది యూపీ ప్రజలు మొగ్గు చూపారు. 38 శాతం మంది యోగి అనుకూలంగా ఉండగా, అఖిలేశ్‌ యాదవ్‌ కావాలని 33 శాతం మంది కోరుకున్నారు. బీఎస్‌పీ అధినేత్రి మాయావతిని సీఎంగా చూడాలని 16 శాతం మంది కోరుకోగా, కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీకి అనుకూలంగా 6 శాతం మంది ఉన్నారు. (క్లిక్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు)

ఎన్నికల ప్రధానాంశాలు ఇవే
ధరల పెరుగుదల, నిరుద్యోగం, కనీస మద్దతు ధర, లఖింపూర్ ఖేరీ ఘటన, కోవిడ్‌ వంటివి ఎన్నికల ప్రధానాంశాలుగా నిలిచాయి. చెరకు రైతులకు చక్కెర కర్మాగారాల బకాయిల అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని సర్వే వెల్లడించింది. పశువుల నుంచి పంటలను కాపాడే విషయాన్ని కూడా ఓటర్లు సీరియస్‌గానే తీసుకున్నట్టు తెలుస్తోంది.

యోగి పాలనపై సంతృప్తి
తాజా ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్‌ను గద్దె దించే మానసిక స్థితికి ఓటరుకు చేరుకోలేదని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది. ప్రభుత్వ పథకాల నుంచి లబ్ది పొందినవారు సానుకూలత వ్యక్తం కావడం, శాంతిభద్రత పరిరక్షణ, అవినీతి రహిత పాలన పట్ల యూపీ వాసులు సంతృప్తిగా ఉన్నట్టు కనబడుతోంది. మహిళా ఓటర్లు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపారని మరో అంచనా.  అయితే బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండరన్న వాదనలు సీఎం యోగికి కంటగింపుగా మారాయి. 

ఎవరెవరికి ఎన్ని ఓట్లు
బీజేపీ, మిత్రపక్షాలకు కలిపి 38 శాతం ఓట్లు.. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 35 శాతం, బీఎస్‌పీకి 16 శాతం, కాంగ్రెస్‌ 7 శాతం, ఇతరులకు 4 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. అంచనా వేసిన కంటే 5 శాతం అటుఇటు ఉండొచ్చని పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది. 

ఆత్మసాక్షి ఎగ్జిట్‌పోల్స్‌ ప్రకారం.. 
బీజేపీ 138 నుంచి 140, సమాజ్‌వాదీ పార్టీ 235 నుంచి 240, బీఎస్‌పీ 19 నుంచి 23, కాంగ్రెస్‌ 12 నుంచి 16, ఇతరులకు 1 నుంచి 2 సీట్లు వస్తాయి.

మరిన్ని వార్తలు