వీర్లకొండ ఎక్కేద్దాం రండి!

2 Jan, 2023 11:33 IST|Sakshi

నల్లమలలో ట్రెక్కింగ్‌

తుమ్మలబైలు వద్దనున్న వీర్లకొండ అనువుగా గుర్తింపు

ట్రెక్కింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

ఇప్పటికే కొండ శిఖరంపై వాచ్‌ టవర్‌ ఏర్పాటు

గైడ్‌లుగా గిరిజనులు

ప్రకృతి సౌందర్యానికి నెలవైన నల్లమల అభయారణ్యం పర్యాటకులకు స్వర్గధామం. ఇప్పటికే జంగిల్‌ సఫారీతో యాత్రికులను ఆకట్టుకుంటున్న అటవీ శాఖ.. మరో అడుగు ముందుకేసింది. ట్రెక్కింగ్‌పై ఆసక్తి ఉండేవారి కోసం వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్‌ పాయింట్‌  ఏర్పాటు చేసింది. టెక్కింగ్‌ చేసే పర్యాటకుల కోసం స్థానిక గిరిజనులను గైడ్‌లుగా వినియోగించనుంది. ఫలితంగా వారికి ఉపాధి లభిస్తుంది. పచ్చని కొండలను సాహసోపేతంగా ఎక్కేయాలని సరదాపడుతున్నారా.. వీర్లకొండ విశేషాలేంటో చూద్దాం రండి.. 

పెద్దదోర్నాల(ప్రకాశం జిల్లా): నల్లమలలో పర్యటించే యాత్రికులకు వసతి, సౌకర్యాలు కల్పించటంతో పాటు వారిలోని ఉత్సాహం, పట్టుదల, ధైర్య సాహసాలను ప్రదర్శించేందుకు అటవీశాఖ సరికొత్త కార్యక్రమాలను రూపొందించనుంది. పర్యాటకులకు చిన్న చిన్న సాహసాలతో కూడిన ఎన్నో అడ్వంచర్లను చేపట్టేందుకు అద్భుత అవకాశాన్ని కల్పించే దిశగా అడుగులు వేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే శ్రీశైలం వెళ్లే యాత్రికుల కోసం రెస్టు రూములు, సావనీర్‌ షాపులు ఏర్పాటు చేసిన అధికారులు సరికొత్తగా పర్వతారోహణ (ట్రెక్కింగ్‌)కు అవకాశం కల్పించి యాత్రికులకు ఉల్లాసాన్ని కలిగించనున్నారు. ఇందు కోసం మండల పరిధి తుమ్మలబైలు సమీపంలోని వీర్లకొండ అనువుగా ఉందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు యుద్ధప్రాతిపదిన పర్వతారోహణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు ఉత్సాహవంతులైన గిరిజన యువకులకు ఉపాధి కల్పించటంతో పాటు, అటవీశాఖ కూడా కొంత ఆదాయం సమకూర్చుకోనుంది.

వీర్లకొండ వద్ద ట్రెక్కింగ్‌ ఏర్పాట్లు వేగవంతం 
అటవీశాఖ సరికొత్తగా ఏర్పాటు చేయనున్న ట్రెక్కింగ్‌ కార్యక్రమానికి పెద్దదోర్నాల, తుమ్మలబైలు మధ్య ఉన్న వీర్లకొండ అనువుగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించిన అధికారులు కొన్ని రోజుల కిందట వీర్లకొండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అక్కడి వాతావరణ పరిస్థితులతో పాటు, వన్యప్రాణుల సంచారం, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. ట్రెక్కింగ్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే మొదలయ్యాయి. పర్వతారోహణకి అనువుగా వీర్లకొండ పైకి నడిచి వెళ్లేందుకు నడక మార్గాన్ని ఏర్పాటు చేయటంలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

నడక దారిలో అడ్డంగా ఉన్న చెట్లకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయటంతో పాటు, దట్టంగా ఉన్న గడ్డి పొదలను తొలగించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దదోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే మార్గంలో తుమ్మలబైలు గిరిజన గూడేనికి 2 కిలోమీటర్లు ముందుగానే వీర్లకొండ వస్తుందని,  శ్రీశైలం ప్రధాన రహదారిలోనే వీర్లకొండ ఉండటం వల్ల యాత్రికులు, పర్యాటకులు నడవాల్సిన అవసరం లేకుండా వారి వాహనాలను అక్కడే పార్కింగ్‌ చేసుకోవటానికి వీలుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ప్రధాన రహదారి వద్ద నుంచి కొండపైకి ఎక్కేందుకు 500 మీటర్లు, కొండ దిగేందుకు 500 మీటర్లు మొత్తంగా ఒక 1 కిలో మీటరు మేర ట్రెక్కింగ్‌ ఉంటుంది. ట్రెక్కింగ్‌కు సంబంధించి ఒక్కొక్కరికి రూ.300 మేర ట్రెక్కింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి వీర్లకొండపై ఇప్పటికే వాచ్‌ టవర్‌ను అధికారులు సిద్ధం చేశారు. దీంతో పాటు అత్యాధునిక బైనాక్యులర్‌ను ఏర్పాటు చేసి నల్లమల అభయారణ్య పరిసరాలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశాన్ని అధికారులు కల్పించనున్నారు. ఇప్పటికే కొండపైకి నడక మార్గాన్ని సిద్ధం చేశారు. ఈనెలాఖరు నాటికి ట్రెక్కింగ్‌కు పర్యాటకులకు అనుమతించనున్నారు.    

ట్రెక్కింగ్‌తో చెంచు గిరిజనులకు ఆర్థికాభివృద్ధి
నల్లమలలో ట్రెక్కింగ్‌ ఏర్పాటు చేయటంతో పాటు అక్కడి చెంచు గిరిజనులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు అవకాశం ఉంటుంది. కొంత మంది గిరిజన యువకులకు శిక్షణ ఇచ్చి వారిని గైడ్‌లుగా ఏర్పాటు చేసి వారి సేవలను వినియోగించనున్నారు. ఇందులో భాగంగా ట్రెక్కింగ్‌కు వెళ్లే ఒక్కో పర్యాటకుడితో పాటు ఒక్కో గైడు వారి వెంట ఉంటారు. ట్రెక్కింగ్‌కు వెళ్లే వారిని జాగ్రత్తగా తీసుకెళ్లటంతో పాటు, నల్లమల విశిష్టతను తెలియజేయటం, వారి రక్షణ పట్ల జాగ్రత్తలు తీసుకుని వారిని మళ్లీ తిరిగి కిందికి తీసుకురావటం గైడ్‌లు చూసుకుంటారని అధికారులు పేర్కొంటున్నారు. దీని వల్ల ఒక్కో గైడుకు అటవీశాఖ వసూలు చేసే రూ.300 రుసుములో రూ.200 గైడ్‌లకే ఇస్తామని అటవీశాఖ రేంజి అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు. ప్రతి యువకుడికి రోజుకు రెండు పర్యాయాలు మాత్రమే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మంది యువకులకు గైడ్‌గా ఉండే అవకాశం కలుగుతుంది. 

ట్రెక్కింగ్‌ పనులు వేగవంతం 
నల్లమలలో పర్యటించే యాత్రికులు, పర్యాటకుల కోసం ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగా తుమ్మలబైలు వద్ద పర్వతారోహణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ట్రెక్కింగ్‌తో గిరిజన యువకులకు ఆదాయ మార్గాలను పెంపొందించేందుకు కృషి చేస్తున్నాం. దీని వల్ల పర్యాటకులకు మరొక సందర్శనీయ ప్రాంతంగా వీర్లకొండ మారనుంది.          
– విశ్వేశ్వరరావు, ఫారెస్టు రేంజి అధికారి

మరిన్ని వార్తలు