ఆనాడు అదరగొట్టారు.. ఈనాడు దాచిపెట్టారు.!

29 Nov, 2022 15:55 IST|Sakshi

రాజధాని కేసులో పచ్చమీడియా పక్షపాతం

టీడీపీకి బాజా కొట్టేందుకు చివరిదాకా ప్రయత్నం

అమరావతి రాజధాని వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు, ఆ సందర్భంగా గౌరవ న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా ఆహ్వానించదగినవి. ఏపీ హైకోర్టు గత మార్చి నెలలో దీనికి సంబంధించి తీర్పు వెలువరించినప్పుడే కాస్త హేతుబద్దంగా ఆలోచించేవారికి, చట్టాలు, రాజ్యాంగంపై అవగాహన ఉన్నవారికి ఆశ్చర్యం కలిగించింది. ఇదేమిటి! మూడు నెలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఆరు నెలల్లో రాజధాని నిర్మించాలని కోర్టు చెప్పడం ఏమిటని అనుకున్నారు. సరిగ్గా ఆ భావనలకు అనుగుణంగానే సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. అప్పట్లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అవి అద్బుతమైన ఆదేశాలని, రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని తెలుగుదేశం పార్టీవారు కాని, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు తదితర మీడియా సంస్థలు కాని ప్రచారం చేశాయి. సంపాదకీయాలు రాసి ఊదరగొట్టాయి.

ఎల్లో మీడియాకు మింగుడు పడలేదా?
విశేషం ఏమిటంటే ఇప్పుడు ఆ మీడియాకు ఈ స్టే ఆదేశాలు మింగుడుపడనివిగా మారాయి. అందుకే స్టే ఇవ్వని రెండు అంశాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ప్రయత్నించాయి. రాజధాని మార్పు, మూడు రాజధానుల ఏర్పాటుపై శాసనసభకు చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్టే ఇవ్వని మాట నిజమే. కానీ అందుకు న్యాయమూర్తులు కారణం కూడా చెప్పారు. ఆ అంశంపై స్టే ఇస్తే, ఇక విచారణ నిరర్ధకం అవుతుందని, అన్ని అంశాలపై లోతుగా విచారిస్తామని వారు అన్నారు. అంతవరకు అభ్యంతరం లేదు. స్టే ఆధారంగా మరో కొత్త చట్టం తెచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మాట చెప్పి ఉండవచ్చు. 

రాజ్యాంగంలో ఏముంది?
రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొన్ని మౌలిక అంశాలను లేవనెత్తింది. లేని చట్టాలపై హైకోర్టు ఊహాజనితంగా తీర్పు ఇవ్వవచ్చా అన్న ప్రశ్నను ప్రభుత్వం తరపు న్యాయవాదులు ప్రశ్నించారు. రాజధాని నిర్ణయం అంశం రాష్ట్రం పరిధిలోనిదని ప్రభుత్వ వాదన. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేసి, రాజధాని అన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోదని స్పష్టం చేసింది. బహుశా కేంద్రం కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వబోయే అఫిడవిట్లో అదే విషయం చెప్పవచ్చు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ నుంచి  పలు సమస్యలు ఎదుర్కుంటోందన్న అభిప్రాయం సర్వత్రా ఉంది.

ఆయా కేసులలో కొందరు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వంపై  చేసిన కొన్ని వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండేవి. చివరికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి న్యాయమూర్తులు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, తీర్పులో పెట్టాలని కోరారు. రాజధానిపై చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు అనడంపై శాసనసభ చర్చించింది. అందులో మాట్లాడిన వక్తలంతా హైకోర్టు తీరును తప్పు పట్టారు. ఈ నేపధ్యంలో వివిధ కారణాలతో ఆలస్యంగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన ఈ కేసులో  రాష్ట్ర ప్రభుత్వ వాదనను చాలావరకు బలపరిచేలా  స్టే ఇచ్చినట్లు అనిపిస్తుంది. అంతిమంగా ఎలాంటి తీర్పు ఇస్తుందన్న అంశంపై మనం వ్యాఖ్యానించజాలనప్పటికీ, మొత్తం మీద ప్రభుత్వానికి చాలావరకు ఊరట అని చెప్పాలి. 

బాబు, దత్తపుత్రుడి నోట.. మాట రాలేదెందుకు?
శాసన అధికారాలలో హైకోర్టు జోక్యాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గమనించారని అనుకోవాలి. హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానింగ్ నిపుణులా అని ప్రశ్నించడం, అన్నీ హైకోర్టే చేస్తే ఇక ప్రజా ప్రతినిదులు ఎందుకు, క్యాబినెట్ ఎందుకు అని ప్రశ్నించిన తీరు ఆసక్తికరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఎవరూ దీనిపై స్పందించకపోవడం కూడా గమనించాలి. ఈ కేసులో సుప్రీంకోర్టులో ఏ మాత్రం అనుకూలత వ్యక్తం అయినా, వారు ఈ పాటి ఇల్లెక్కి కోడై కూసేవారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిపోవాలన్నంతవరకు వెళ్లేవారు. వారు మాట్లాడలేదు కాని, కొందరు అమరావతి రైతుల పేరుతో పాటు సీపీఐ నుంచి రామకృష్ణ మాత్రం స్పందించారు. హైకోర్టు రెండు అంశాలపై స్టే ఇవ్వలేదు కనుక  రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని వారు కోరారు. అది మొక్కుబడి కామెంట్ అన్న సంగతి తెలుస్తూనే ఉంది. కాగా జనవరి 31 వరకు ఈ కేసును వాయిదా వేసినందున రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానులపై ముందుకు వెళ్లకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే న్యాయ శాస్త్ర విద్య అభ్యసించేవారికి ఇది మంచి కేస్ స్టడీ అవుతుంది.
హితేషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
 

మరిన్ని వార్తలు