Women's Day 2022: విజయవంతంగా 25 ఏళ్లు.. రూ. 20 సభ్యత్వంతో మొదలై.. ఇప్పుడు కోటికి పైగా నిధులతో..

7 Mar, 2022 18:36 IST|Sakshi
2019 సంవత్సరాంతం నాటికి బకాయిలు లేకుండా వసూలు చేసినందుకు అభినందనగా సమితి నుంచి పురస్కారం

పొదుపు.. ఒక వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. ఒక్కో నీటి చుక్క సముద్రమైనట్టు.. సంపాదించే దాంట్లో ఎంతో కొంత కూడబెడుతూ ఉంటే... ఒకానొక నాడు పెద్ద మొత్తం చేతికి వస్తుంది. అత్యవసర సమయంలో మనల్ని ఆదుకుంటుంది. ఇక పొదుపు మంత్రం పాటించడంలో మహిళలు ముందుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ముఖ్యంగా గృహిణులు ‘ఇంటి పెద్ద’ ఇచ్చే మొత్తం నుంచే కుటుంబ సభ్యులందరి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగినులకైతే నెలవారీ ఆదాయం ఉంటుంది కాబట్టి వారితో పోలిస్తే పెద్దగా సమస్యలు ఎదురుకాకపోవచ్చు. ఇదంతా సగటు మధ్య తరగతి కుటుంబాలకు చెందిన స్త్రీల గురించే! అన్ని ఖర్చులు పోనూ కొంతమొత్తాన్ని పొదుపు చేసి అవసరాలకు వాడుకోవడం సహజం. అయితే, వ్యక్తిగత పొదుపు కంటే కూడా సామూహిక పొదుపు ఎల్లప్పుడూ అదనపు మేలు చేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా పొదుపు సంఘాలు ఇందుకు చక్కని ఉదాహరణ. అవసరమైన సమయంలో తక్కువ వడ్డీకి అప్పు ఇచ్చి ఆదుకుంటాయి. అలాంటి వాటిలో కరీంనగర్‌ జిల్లా హుజురాబాద్‌ మండలంలోని తుమ్మనపల్లి గ్రామం కూడా ఒకటి. ఎలాంటి ఆటంకాలు, అవకతవకలు లేకుండా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ గ్రామానికి చెందిన ఝాన్సీ మహిళా సంఘం. ఇటీవలే సిల్వర్‌ జూబ్లీ వేడుకలు చేసుకుంది. 

తమ చేత, తమ కోసం ఏర్పడ్డ ఈ సంఘాన్ని ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దిన ఘనత మహిళా శక్తిదే. ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షురాలిగా ఉన్న బొక్కల పుష్పలీల ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగడం ఓ రికార్డు అనే చెప్పాలి. ఆమెకు చేదోడువాదోడుగా నిలిచే పాలవర్గ సభ్యులు.. అన్నిటికీ మించి తీసుకున్న అప్పును సరైన సమయంలో చెల్లిస్తున్న సభ్యుల సహకారం వల్లే ఈ సంఘం నిర్వహణ విజయవంతంగా కొనసాగుతోంది. 20 రూపాయల(మొదటి సభ్యత్వం)తో మొదలై నేటికి కోటికి పైగా నిధులు సమకూర్చుకుంది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీరి గురించి ప్రత్యేక కథనం.

అలా మొదలైంది..
1997 ఏప్రిల్‌లో 100 మంది సభ్యులతో ఝాన్సీ మహిళా సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంఘంలో 750 మంది సభ్యులు, 58 మంది మార్గనిర్దేశకులు ఉన్నారు. పాలనా విభాగంలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు(డైరెక్టర్లు) ఉంటారు. మొదట్లో ఒక్కో సభ్యురాలు 20 రూపాయలు పొదుపు కట్టేవారు. 600 రూపాయలు జమ అయిన తర్వాత 1800 రూపాయలు అప్పుగా పొందవచ్చు.

నెలకు కొంత అసలు, వడ్డీ కలిపి కట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకు 50 రూపాయల మేర పొదుపు చేస్తున్నారు. తొలినాళ్లలో వడ్డీ వందకు రూ. 2. అయితే, నిధులు సమకూరిన కొద్దీ వడ్డీని తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం 75 పైసలుగా ఉంది.  ఒక సభ్యురాలికి నియమిత పొదుపును బట్టి గరిష్టంగా 70 వేల రూపాయల వరకు అప్పు ఇస్తారు. క్రమం తప్పకుండా చెల్లించే వారికి ప్రత్యేక అప్పు కింద మరో 40 వేలు ఇస్తారు.

కాబట్టి ఏవైనా అవసరాలు ఉన్నవారు వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లకుండా తమ సంఘం నుంచే తక్కువ వడ్డీకి అప్పు పొందవచ్చు. సభ్యులకు సంఘం ఇన్సూరెన్స్‌ ప్రీమియం కూడా చెల్లిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా చేసుకునే వెసలుబాటు ఉంటుంది. గరిష్టంగా లక్ష వరకు ఎఫ్‌డీ చేసుకోవచ్చు. 8 ఏళ్లకు మెచ్యూర్‌ అవుతుంది. 9 శాతం వడ్డీ చెల్లిస్తారు. 

మొదట్లో ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ..
నేను వరంగల్‌ సహకార సంఘానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లినపుడు మా గ్రామంలో కూడా ఇలాంటి సంఘం ఉంటే ఎంతో బాగుంటుంది అనిపించింది. అందుకే ఊరికి తిరిగి రాగానే కొంత మంది మహిళలను కలిసి నా ఆలోచనను పంచుకున్నాను. అందరం కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి తీర్మానం చేసుకున్నాం. ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పించాం. అప్పట్లో రోజూవారీ కూలీ 20 రూపాయలు. అందుకే ఒక్కరోజు వేతనాన్ని పొదుపు మలచుకుందాం అనే నినాదంతో ముందుకు వెళ్లాము. 

అలా నెలరోజుల్లో 100 మంది సభ్యులుగా చేరారు. తర్వాత కొన్ని వ్యతిరేక గళాలు వినిపించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాం. దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడి దాకా చేరుకున్నాం. కోటికి పైగా నిధులు సమకూరాయి. లెక్కలు చూసేందుకు గణకులు ఉంటారు. ప్రతి ఏడాది ఆడిట్‌ చేయిస్తాం. ఏడాదికోసారి మహాసభ పెట్టి లెక్కలన్నీ అందరికీ వినిపిస్తాం. మాకంటూ సొంత భవనం ఉంది. 25 ఏళ్లుగా నేను అధ్యక్షురాలిగా ఉన్నాను. ఈ ప్రయాణంలో కొన్ని ఆటుపోట్లు చవిచూశాను. అలాంటి సమయంలో నా భర్త ఎల్లారెడ్డి అందించిన ప్రోత్సాహం మరువలేనిది.
-బొక్కల పుష్పలీల, ఝాన్సీ మహిళా సంఘం అధ్యక్షురాలు.

అకౌంటెంట్‌గా పనిచేస్తున్నా
సంఘంలో సభ్యురాలిని. 2001 నుంచి ఇక్కడ గణకులుగా పనిచేస్తున్నా. ఉదయం 9 గంటలకు ఆఫీసు తెరుస్తాను. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యులు వచ్చి పొదుపు జమ, అప్పు, వడ్డీ చెల్లిస్తూ ఉంటారు. మొదట్లో నా జీతం 300 రూపాయలు. ఇప్పుడు నెలకు 9600. అధ్యక్షులు, పాలకవర్గ సభ్యుల సూచన మేరకు నా విధి నిర్వర్తిస్తాను. మంచి సంఘంగా మాకు గుర్తింపు ఉంది. -బిజ్జిగిరి తిరుమల, గణకులు 

నేను సైతం..
సంఘం గురించి వినగానే నేను కూడా అందులో సభ్యురాలినైతే బాగుంటుందని భావించా. రూ. 20 కట్టి సభ్యత్వం తీసుకున్నా. నాతో పాటు నలుగురిని చేర్పించా. ఒక్కో గ్రూపులో ఐదుగురు సభ్యులు ఉంటారు. కుటుంబానికి అవసరం వచ్చిన ప్రతిసారి సంఘం నుంచి అప్పు తీసుకోవడం.. సరైన సమయంలో చెల్లించడం జరుగుతోంది. కొంత డబ్బు ఫిక్స్‌డ్‌ కూడా చేసుకున్నా. దానిపై లోన్‌ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఇప్పటికీ మూడుసార్లు డైరెక్టర్‌గా ఎన్నికయ్యాను. ఏడాదిపాటు ఉపాధ్యక్షురాలిగా పనిచేశాను. సాధారణ నెలవారీ సమావేశాలకు పన్నెండు మంది డైరెక్టర్లు హాజరవుతారు. ఐదో తేదీ నుంచి 30 వరకు అప్పు కట్టే వీలుంటుంది. మొండి బకాయిలు ఉంటే ఇంటికి వసూలుకు వెళ్తాం.  -వై. రత్నమాల, డైరెక్టర్‌

అప్పు పుట్టని పరిస్థితుల్లో ఆపద్భాందవిగా
పొలంలో చల్లేందుకు ఎరువులు కొనేందుకు అప్పు పుట్టని పరిస్థితుల్లో సంఘం నన్ను ఆదుకుంది. అవసరం ఉన్నపుడు అప్పు తీసుకోవడం, తర్వాత చెల్లించడం పరిపాటిగా మారింది. నిజంగా పాలిట సంఘం ఆపద్భాందవి అనే చెప్తాను. ఇంత పెద్ద కుటుంబంలో సభ్యురాలిని కావడం సంతోషంగా ఉంది. -శ్రీరాముల ఆగమ్మ, పాలకవర్గ సభ్యురాలు

నన్ను సంఘమే ఆదుకుంది
సొంత వ్యవసాయ భూమి ఉన్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపాధి నిమిత్తం మా కుటుంబం వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. దాదాపు 10 ఏళ్ల పాటు అక్కడే ఉండి గ్రామానికి తిరిగి వచ్చాం. తిరిగి వ్యవసాయం మొదలుపెట్టాం. అప్పటికే నేను సంఘంలో సభ్యత్వం తీసుకున్నా. చిన్న చిన్న అవసరాలకు, పెట్టుబడికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అప్పు తీసుకునేదాన్ని. డైరెక్టర్‌గా పనిచేశాను. క్రమశిక్షణ కలిగిన సంఘంగా పేరు తెచ్చుకున్న సంస్థలో భాగం కావడం సంతోషంగా ఉంది. - నర్ర రజిత, సభ్యురాలు

-సుష్మారెడ్డి యాళ్ల, సాక్షి వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం

 

మరిన్ని వార్తలు