సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి

10 Mar, 2023 03:36 IST|Sakshi
శివలింగ మహరాజ్‌ను సన్మానిస్తున్న భక్తులు

సంగారెడ్డి టౌన్‌: జిల్లాలో మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో మత్స్యశాఖ అధికారులు, సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఇప్పటిరకు 4,930 మంది కొత్త సభ్యులకు గాను 1,626 మంది నమోదయ్యారని, లక్ష్యాన్ని పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రత్యేక క్యాంప్‌లు నిర్వహించి అందరూ సభ్యత్వం పొందేలా చూడాలన్నారు. ఈ నెలాఖరు లోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ వీరారెడ్డి, మత్స్య శాఖ ఏడీ సతీశ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్‌ 25 నుంచి

కేదార్‌నాథ్‌ దర్శనం

నారాయణఖేడ్‌: ఉత్తరాఖాండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయంలో ఏప్రిల్‌ 25 నుంచి దర్శనాలు ప్రారంభం అవుతాయని కేదార్‌నాథ్‌ ఆలయ ప్రధాన పూజారి శివలింగ మహరాజ్‌ తెలిపారు. పట్టణంలోని శ్రీషిర్డీ సాయిబాబ ఆలయాన్ని గురువారం సందర్శించిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ బాధ్యులు, భక్తులు ఆయనను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏప్రిల్‌ 20న కేదార్‌నాథ్‌లో పంచ నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుందని, 25 నుంచి దర్శనాలు ఉంటాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలన్నారు. ఆయనతో పూజారి శ్రీకాంత్‌ స్వామి తదితరులు ఉన్నారు.

‘బలవంతపు భూసేకరణ ఆపాలి’

కొండాపూర్‌(సంగారెడ్డి): పటాన్‌ చెరువు మండలంలో జరుగుతున్న బలవంతపు భూసేకరణ వెంటనే ఆపేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం సంగారెడ్డిలోని కేవల్‌కిషన్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. క్వారీలు, క్రషర్ల పేరుతో అసైన్డ్‌ భూములను కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. పెద్ద కంచర్ల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములను లాజిస్టిక్‌ కంపెనీకి అప్పగించడంపై మండిపడ్డారు. తక్షణమే రైతుల భూములను వాపస్‌ ఇవ్వాలని, లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు యాదవ రెడ్డి, నాయకులు అశోక్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

హోం మంత్రిని కలిసిన తన్వీర్‌

జహీరాబాద్‌ టౌన్‌: రాష్ట్ర మైనార్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమితుడైన తన్వీర్‌ గురువారం హోం మంత్రి మహమూద్‌ అలీని కలిశారు. హైదరాబాద్‌లోని హోం మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

‘మన ఊరు–మన బడి’ పనుల్లో వేగం పెంచాలి

గజ్వేల్‌: ‘మన ఊరు – మన బడి’ పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ(తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ ఉమెన్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి ఆదేశించారు. గురువారం గజ్వేల్‌లోని ఐఓసీలో అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌తో కలిసి పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో 92 పాఠశాలల్లో చేపట్టిన పనుల తీరును తెలుసుకున్న ఆయన పనుల్లో నాణ్యతతోపాటు వేగం కూడా కీలకమని చెప్పారు. సమీక్షలో టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, డీఈ మధు, సెక్టోరియల్‌ అధికారి రామస్వామితోపాటు ఆయా మండలాల ఎంఈఓలు, హెచ్‌ఎం, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు