మహిళతో వివాహేతర సంబంధం..  ఆమె కూతురుపై పలుమార్లు.. 

28 May, 2023 12:34 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సైదులు

కొల్చారం(నర్సాపూర్‌): మండలంలోని పోతంశెట్టిపల్లి గ్రామ శివారు హనుమాన్‌ మండల్‌ మంజీరా నదిలో ఈనెల 25వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం విదితమే. అయితే ఎస్పీ ఆదేశాల మేరకు హత్య కోణంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం 36 గంటల్లోనే కేసును ఛేదించింది. హత్యకు సంబంధించి శనివారం మెదక్‌ డీఎస్పీ సైదులు పూర్తి వివరాలు వెల్లడించారు. లభ్యమైన వ్యక్తి మృతదేహంపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా పటాన్‌చెరు మండలం బీడీఎల్‌ భానుర్‌ పోలీస్‌స్టేషన్‌లో అవే ఆనవాళ్లతో మిస్సింగ్‌ కేసు నమోదైనట్టు తెలిపారు. హత్యకు గురైన వ్యక్తి సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటి ఘనపూర్‌కు చెందిన కావలి రాములు (35)గా గుర్తించామన్నారు.

రాములు నందిగామకు చెందిన మ్యాదరి వీరమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు చెప్పారు. మృతుడి కుటుంబీకుల అనుమానంతో ఆమెను విచారించగా పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయన్నారు. వీరమణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న రాములు, ఆమె కూతురు మైనర్‌పై కన్ను వేసినట్టు వివరించారు. తన కూతురుపై రాములు పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో వీరమణి రాములును దూరం పెట్టింది. అయినా అతడి వేధింపులు మాత్రం ఆగలేదన్నారు. ఈ విషయాన్ని ఆమె బంధువులకు చెప్పి హత్యకు పథకం వేసిందన్నారు. ఇందులో భాగంగా ఈనెల 17న మెదక్‌లోని బంధువులకు ఇంటికి వచ్చిన వీరమణి పథకం ప్రకారం రాములును తన వద్దకు రావాలని సమాచారం అందించింది.

అప్పటికే బంధువులు, స్నేహితులైన కౌడిపల్లికి చెందిన మ్యాదరి నర్సింలు, వీర్‌సింగ్‌, పట్నం మహేశ్‌, మహ్మద్‌ ఆరీఫ్‌, మెదక్‌ పట్టణం ఫతేనగర్‌కు చెందిన మ్యాదరి అనిరుధ్‌, స్వప్నల సహకారంతో రాములును అనిరుధ్‌ ఇంటికి తీసుకువచ్చి అందరూ కలిసి అప్పటికే సిద్ధం చేసుకున్న ఇనుపరాడుతో తలపై కొట్టి చంపేశారన్నారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఆటోలో మెదక్‌ నుంచి కొల్చారం మండల పరిధిలోని హనుమాన్‌ బండల్‌ నది సమీపంలో పడేసినట్టు తెలిపారు.

హత్యకు కారణమైన ఏడుగురిని అదుపులోకి తీసుకొని.. వారి నుంచి హత్యకు ఉపయోగించిన ఇనుపరాడు, ఆటోను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశామన్నారు. నిందితులను రిమాండ్‌కు పంపినట్టు డీఎస్పీ వివరించారు. హత్య కేసును 36 గంటల్లో ఛేదించిన కొల్చారం పోలీసులను అభినందించడంతో పాటు ఎస్పీ ద్వారా రివార్డు అందజేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. సమావేశంలో మెదక్‌ రూరల్‌ సీఐ విజయ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు