రెండో భార్య మోజులో పడి ఘాతుకం.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ..

11 Aug, 2023 11:09 IST|Sakshi

మెదక్‌: రెండో భార్య మోజులో పడి మొదటి భార్యకు బలవంతంగా పురుగు మందు తాగించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆమె ఐదురోజుల పాటు ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. మెదక్‌ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాట్రోత్‌ రమేశ్‌కు కౌడిపల్లి మండలం మహబూబ్‌నగర్‌ తండాకు చెందిన స్వరూపను (30) పదేళ్ల కిత్రం ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక బాబు జన్మించాడు.

కాగా రమేశ్‌ ఇటీవల తిమ్మక్కపల్లి తండాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్య స్వరూపకు, రమేశ్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా మొదటి భార్యను చంపాలని పన్నాగం పన్నాడు. ఈనెల 6వ తేదీన సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ముందే పురుగు మందు డబ్బా తీసుకొచ్చి బలవంతంగా స్వరూపకు తాగించాడు.

అపస్మారక స్థితికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి పురుగు మందు తాగిందని చెప్పాడు. అనంతరం ఆమెను మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. రెండో భార్య మంజుల, అల్లుడు రమేశ్‌ వేధింపులకు గురి చేసి తన కూతురును పొట్టనపెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. గురువారం సాయంత్రం ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు