‘కాటా’ కే కాంగ్రెస్‌ టికెట్‌

13 Nov, 2023 11:56 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి /పటాన్‌చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిత్వం విషయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ టికెట్‌ను పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయిస్తూ హస్తం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల క్రితం ఈ టికెట్‌ను నీలం మధు ముదిరాజ్‌కు ప్రకటించిన విషయం విదితమే. కానీ, ఆయనకు బీ ఫారం ఇవ్వలేదు. ఏఐసీసీ ఆదేశాల మేరకు బీ ఫారాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు నీలం మధుకు పీసీసీ నాయకత్వం పేర్కొంది. మరోవైపు నీలం మధుకు టికెట్‌ ప్రకటించడం పట్ల కాటా శ్రీనివాస్‌గౌడ్‌ వర్గం భగ్గుమంది. ఆయన వర్గీయులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. గాంధీభవన్‌ను రేవంత్‌ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ప్రకటించిన తుది జాబితాలో నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు కేటాయిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.

చక్రం తిప్పిన దామోదరం

పటాన్‌చెరు టికెట్‌ను తన అనుచరుడు కాటా శ్రీనివాస్‌గౌడ్‌కు ఇప్పించేలా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహ చక్రం తిప్పినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందుగా ఈ టికెట్‌ను నీలంమధుకు ప్రకటించడం పట్ల దామోదర అధిష్టానంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. తిరిగి కాటాకే ప్రకటించేలా దామోదర ప్రయత్నం చేశారని కాంగ్రెస్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, కాటాకు టికెట్‌ కేటాయించడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు జరిపారు.

పేరు: కాటా శ్రీనివాస్‌గౌడ్‌

జననం: 13 డిసెంబర్‌, 1980

తండ్రి: దివంగత దర్శన్‌గౌడ్‌

భార్య పేరు: కాటా సుధారాణి

(జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు)

సంతానం: ఇద్దరు పిల్లలు

రాజకీయ జీవితం

2013లో జరిగిన సర్పంచ్‌ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి సర్పంచ్‌ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

2018 కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి 78,775 ఓట్లు పొంది రెండో స్థానంలో నిలిచారు.

మరిన్ని వార్తలు