నియోజకవర్గాలవారీగా ఫెసిలిటేషన్‌ సెంటర్‌

14 Nov, 2023 04:22 IST|Sakshi
మాట్లాడుతున్న శరత్‌

సంగారెడ్డి టౌన్‌: ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి శరత్‌ రిటర్నింగ్‌ అధికారులకు సూచించారు. సోమవారం తన క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఏఆర్‌ఓలు, నోడల్‌ అధికారులు, తదితరులతో కలిసి ఆయన ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షించారు. పోలింగ్‌ విధుల్లో ఉండే సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చి స్వీకరించాలని, ఇది రేపటిలోగా పూర్తి కావాలని చెప్పారు. ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సహకరించాలని తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 80 సంవత్సరాల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, అత్యవసర సేవల విభాగపు సిబ్బందికి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలన్నారు. నియోజకవర్గంవారీగా ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సి–విజిల్‌ ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలని, లేనట్లయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నగదు, లిక్కర్‌, గిఫ్ట్‌లు, చీరలు, కుక్కర్లు, తదితర వాస్తు సామగ్రి పంపిణీలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల నియమావళికి సంబంధించి ఉల్లంఘనలు ఎక్కడా జరగకుండా చూసుకోవాలన్నారు. వెబ్‌ కాస్టింగ్‌, కౌంటింగ్‌ సెంటర్‌ ఫైనలైజేషన్‌ తదితర ప్రతిపాదనలు అందజేయాలని వెల్లడించారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల వివరాలు ఇవ్వాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ బాధ్యత సెక్టోరల్‌ అధికారులు, ఏఆర్‌ఓలదేనని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్‌, మాధురి, డీఆర్‌ఓ నగేశ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈలు, నోడల్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌ఓలు, విద్యుత్‌, మున్సిపల్‌ కమిషనర్లు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌, వైద్యారోగ్య శాఖ మెడికల్‌ ఆఫీసర్లు, ఎన్నికల విభాగపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లా ఎన్నికల అధికారి శరత్‌

పోలింగ్‌ స్టిక్కర్‌ ఆవిష్కరణ

జిల్లాలో గల ఓటర్లు ఈనెల 30వ తేదీని గుర్తుంచుకుని, కచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ శరత్‌ పిలుపునిచ్చారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా పోలింగ్‌ తేదీకి సంబంధించిన స్టిక్కర్‌ను సోమవారం తన చాంబర్‌లో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ, ప్రతి ఇంటింటికీ పోలింగ్‌ తేదీ స్టిక్కర్‌ను అతికించి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, మాధురి, స్వీప్‌ నోడల్‌ అధికారి అఖిలేశ్‌రెడ్డి, డీఆర్‌ఓ నగేశ్‌, ఇతర నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు