ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు

23 Nov, 2023 04:32 IST|Sakshi

జహీరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ ఓటు కీలకం కావడంతో వలస ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జీవవనోపాధి, ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారిని గుర్తించి, పోలింగ్‌ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఓటు పడుతుందనే నమ్మకం ఉన్న వారికే తొలి ప్రాధాన్యతగా గుర్తిస్తున్నారు. వలస ఓటర్ల సంబంధీకుల ఆరా తీసి వారికి కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు

ఉపాధి నిమిత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారనే దానిపై అభ్యర్థుల అనుచరులు దృష్టిసారించారు. జిల్లాకు చెందిన ఓటర్లు ప్రధానంగా హైదరాబాద్‌ నగరంతో పాటు తాండూర్‌, వికారాబాద్‌, పరిగి, మెదక్‌, సిద్దిపేట, బెంగుళూరు, పూణే, బీదర్‌, బాల్కి, హుమ్నాబాద్‌ గుల్‌బర్గా, ముంబై తదితర ప్రాంతాలకు ఉపాధి నిమిత్తం వేలాది మంది వలస వెళ్లారు. వీరితో పాటు ఉద్యోగ, వ్యాపార, ఉపాధి, పిల్లల చదువుల నిమిత్తం హైదరాబాద్‌ జంట నగరాల్లో నివాసం ఉంటున్నారు. వీరి మద్దతు కూడగట్టేందుకు రాజకీయ పార్టీల నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. గ్రామాలవారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలు తీసుకుని ఓటర్ల వివరాలు, వారు ఉంటున్న చిరునామా, సెల్‌ఫోన్‌ నంబర్లు గుర్తించి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌ రోజున స్వస్థలాలకు రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇస్తున్నారు. రవాణా చార్జీలతో పాటు భోజనం, ఇతర ఖర్చులకు అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఓటర్లను సమన్వయం చేసి ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల పోలింగ్‌ కేంద్రాలకు రప్పించే బాధ్యతలను కొంత మంది కీలక నేతలకు అప్పగించినట్లు తెలిసింది.

న్యూస్‌రీల్‌

వలస ఓటర్లపై అభ్యర్థుల గురి

పోలింగ్‌ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు

మద్దతు కూడగట్టేందుకు రాయబారాలు

విజయంలో వారి ఓట్లే కీలకం

కీలక నేతలకు బాధ్యతలు

హైదరాబాద్‌లోనే అధికంగా..

దేశంలోని పలు ప్రాంతాల్లో జిల్లాకు చెందిన ఓటర్లు సుమారు 20 వేలకు పైగానే ఉన్నారు. వీరిలో అధికంగా హైదరాబాద్‌ జంట నగరాల్లోనే ఉంటున్నారు. చందానగర్‌, బీహెచ్‌ఈఎల్‌, లంగర్‌హౌజ్‌, టోలీచౌకి, మెహిదీపట్నం, ఎల్‌బీ నగర్‌, హిమాయత్‌నగర్‌, బీరంగూడ, బాలానగర్‌, సికింద్రాబాద్‌, మూసాపేట్‌, జగద్గిరిగుట్ట తదితర ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నారు. దీంతో రాజకీయ పార్టీలు వీరి ఓట్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. హైదరాబాద్‌ నగరం సంగారెడ్డి జిల్లాకు సమీపంలోనే ఉండటంతో ఓటర్లను రప్పించడం పెద్ద కష్టం కాదని ప్రధాన పార్టీల అభ్యర్థులు భావిస్తున్నారు. కొందరికి పోలింగ్‌ రోజున రప్పించేందుకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు