-

1,609 పోలింగ్‌ కేంద్రాలు

28 Nov, 2023 04:48 IST|Sakshi
మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి టౌన్‌ : జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ సోమవారం తెలిపారు. జిల్లాలో 910 ప్రాంతాల్లో మొత్తం 1,609 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయన్నారు. నవంబర్‌ 28 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచార కార్యక్రమం నిషేధించామని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, జిల్లాయేతర వ్యక్తులు ఎవరూ జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ, ఎంసీసీ, పోలీస్‌ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కల్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్‌లు తనిఖీ చేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి లౌడ్‌ స్పీకర్ల వినియోగం, సమావేశాలు నిషేధించినట్లు తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) అనుమతి లేకుండా ఈ నెల 29, 30 తేదీల్లో ప్రింట్‌ మీడియాలో ఎలాంటి ప్రకటనలను ప్రచురించకూడదని తెలిపారు.

రూ.5.24 కోట్ల నగదు జప్తు

జిల్లాలో ఇప్పటి వరకు రూ.5.24 కోట్ల నగదు జప్తు చేశామని, ఆదాయపన్ను శాఖ ద్వారా రూ.19.48 కోట్లు జప్తు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 2,67,863.55 లీటర్ల లిక్కర్‌, 659.58 కిలోల అక్రమ గంజాయిని జప్తు చేశామని పేర్కొన్నారు. 7.155 గ్రాముల బంగారం, 23,641 గ్రాముల వెండి, 1,395 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపా రు. జప్తు చేసిన నగదు నుంచి జిల్లా గ్రీవెన్స్‌ కమిటీ ద్వారా రూ.3.40 కోట్ల విడుదల చేశామని అన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌

మరిన్ని వార్తలు