-

నిధులపై శ్వేతపత్రం ఇస్తారా..?

28 Nov, 2023 06:58 IST|Sakshi
దుబ్బాకలో మాట్లాడుతున్న మాధవనేని రఘునందన్‌రావు

దుబ్బాకటౌన్‌: ‘నేను పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చిన గడ్డ దుబ్బాక అంటే చాలా ప్రేమ’ అని చెప్పిన కేసీఆర్‌.. చింతమడ్క లాగా దుబ్బాకలో ఇంటికి రూ.10 లక్షలు ఎందుకివ్వలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. సోమవారం దుబ్బాకలో ఆయన మాట్లాడారు. దుబ్బాక సభలో కేసీఆర్‌ ఈ ప్రాంతంపై కపట ప్రేమ ఒలకబోశారని..అంత ప్రేమ ఉన్నోడైతే సీఎం చదువుకున్న పాఠశాల భవనం, వేంకటేశ్వర ఆలయం ప్రారంభోత్సవాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ అంటేనే అబద్దాలని.. ఆయన చెప్పిన అబద్దాల గురించి చెప్పాలంటే ఐదేళ్లు పడుతుందని విమర్శించారు.

తండ్రీకొడుకు, అల్లుడికి నా మీద

అంత కోపమెందుకో?

దుబ్బాకకు వరుసపెట్టి తండ్రీకొడుకు, అల్లుడు వచ్చి తనను ఇష్టం వచ్చినట్లు తిడుతుండ్రు అని రఘునందన్‌రావు ఆరోపించారు. అసలు మీరు ఏం చేశారని దుబ్బాకకు వస్తున్నరో ప్రజలకు వివరించాలని అన్నారు. మీరు చేసిన అరాచకాలకు జనానికి విరక్తి వచ్చే దుబ్బాకలో రఘునందన్‌రావు ఎమ్మెల్యే అయ్యాడన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. దుబ్బాక సభలో ఉద్యమకారుడు, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన స్వర్గీయ రామలింగారెడ్డి పేరు తీయడానికి కేసీఆర్‌కు ఎందుకు మనసు రావడం లేదని ప్రశ్నించారు.

దుబ్బాకకు ఎన్ని నిధులు ఇచ్చారు?

గజ్వేల్‌, సిద్దిపేట, సిరిసిల్లలకు నిధులెన్ని ఇచ్చారో.. దుబ్బాకకు ఏం చేశారో శ్వేత పత్రం ఇవ్వాలని కోరారు. 2016లో రామలింగారెడ్డి అడిగినప్పుడు దుబ్బాకకు రెవెన్యూ డివిజన్‌ ఎందుకివ్వలేదన్నారు. ఇప్పుడు ప్రభాకర్‌రెడ్డి గెలిస్తేనే ఇస్తారా.. ఇది ఎంత వరకు సమంజసమో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పుడు గెలిపిస్తే అభివృద్ది చేస్తాం అనడం చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని చెప్పారు.

ఈగ వాలినా ఊరుకోను

దుబ్బాక మీద పరాయి పెత్తనం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. దుబ్బాక ప్రజల మీద ఈగ వాలిన ఊరుకోనన్నారు. దుబ్బాకలో దళితులకు దళిత బంధు, బీసీలకు బీసీ బంధు, పేదలకు డబుల్‌ బెడ్రూంలు ఎందెకివ్వలేదో చెప్పాలన్నారు. దుబ్బాక ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొడితే నేను ఊరుకోనన్నారు. ప్రజల గుండెల్లో నిలిచిన రఘునందన్‌రావును తిడితే వారికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బాలేష్‌గౌడ్‌, ఎస్‌ఎన్‌ చారి, విభూషణ్‌రెడ్డి, సుభాష్‌రెడ్డి తదితరులున్నారు.

అందరికోసం పనిచేస్తా

చేగుంట(తూప్రాన్‌): అభిమానంతో గెలిపిస్తే అందరికోసం పనిచేస్తానని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. సోమవారం పెద్దశివునూర్‌ గ్రామంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అప్పాల శేఖర్‌తోపాటు 100 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దశివునూర్‌ గ్రామస్తులకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు భూమలింగంగౌడ్‌, వెంగళ్‌రావు, అంజాగౌడ్‌, నగేష్‌, శోభన్‌, నర్సింలు పాల్గొన్నారు.

హరీశ్‌.. దుబ్బాకకు ప్రథమ శత్రువు

మిరుదొడ్డి(దుబ్బాక): అభివృద్ధిని అడ్డుకుంటున్న మంత్రి హరీశ్‌రావే దుబ్బాకకు ప్రథమ శత్రువని రఘునందన్‌రావు ఆరోపించారు. మండల కేంద్రమైన మిరుదొడ్డిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దుబ్బాక ఎమ్మెల్యేకు ఎక్కడ పేరొస్తదోనని హరీశ్‌ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకున్నాడన్నారు. దుబ్బాక అభివృద్ధిని కోసం హరీశ్‌, కేటీఆర్‌ చుట్టూ తిరిగి వినతులు సమర్పించినా బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇస్తానంటున్న సీఎం కేసీఆర్‌ మాటలు నమ్మొద్దన్నారు. మిరుదొడ్డి మండలంలో అసైన్డ్‌ భూములను డ్రోన్‌ కెమెరాలతో ఎందుకు సర్వే చేయించారని ప్రశ్నించారు. డబ్బుల మూటలతో వచ్చిన వారికే బీఆర్‌ఎస్‌లో చోటు ఉందన్నారు. దుబ్బాక నియోజక వర్గంలో దళితబంధు, బీసీ బంధు ఇవ్వలేదని మండిపడ్డారు. బీజేపీ గెలిస్తే పింఛన్‌లు రావని బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన బలం బలగం దుబ్బాక ప్రజలేనన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రేషన్‌ కార్డు ఇవ్వలేదని, వైన్స్‌ మాత్రం వెలుస్తున్నాయన్నారు. ప్రభుత్వం స్కీంలు, ఊర్ల పేర్లు, మనుషులను గుర్తించలేని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాత్రం తాగి తందనాలు ఆడడానికి మాత్రం పబ్బులు కావాలని అడుగుతున్నాడని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మొగుళ్ళ మల్లేశం, మద్దెల రోశయ్య, మల్లన్న గారి భిక్షపతి, ఎల్ముల దేవరాజు పాల్గొన్నారు.

చింతమడ్కలా దుబ్బాకలో ఇంటికి రూ.10 లక్షలు ఎందుకివ్వలే..

బీజేపీ అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు

మరిన్ని వార్తలు