-

పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ

28 Nov, 2023 06:58 IST|Sakshi
హుస్నాబాద్‌లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

వర్గల్‌(గజ్వేల్‌): శాంతియుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల పోలీస్‌ అబ్జర్వర్‌ సోనమ్‌ టెన్సింగ్‌ భూటియా సూచించారు. సోమవారం ఆయన తొగుట సీఐ కమలాకర్‌, బేగంపేట ఎస్సై అరుణ్‌తో కలిసి మజీద్‌పల్లి, నెంటూరు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. చెక్‌పోస్ట్‌లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఎన్నికల విధుల్లో అలసత్వం తగదన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తెలిస్తే 8712667309 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఓటు హక్కు వజ్రాయుధం

హుస్నాబాద్‌: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సోమవారం పట్టణంలో ఎస్సై మహేష్‌ జార్ఖండ్‌ ఆర్మ్‌డ్‌ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేష్‌ మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉత్తమ నాయకుడికి ఓటు వేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

జిల్లాలో 144 సెక్షన్‌ అమలు

సిద్దిపేటకమాన్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని సిద్దిపేట సీపీ శ్వేత తెలిపారు. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్‌ 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. 30న ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద గుంపులుగా తిరగవద్దని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పకుండా పాటించాలని తెలిపారు.

ప్రలోభాలకు గురిచేయొద్దు

దుబ్బాక: మద్యం, నగదు, డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు వివేక్‌ కుమార్‌ సిన్హా సూచించారు. సోమవారం దుబ్బాక ఐఓసీ కార్యాలయంలో అభ్యర్థుల ఖర్చుల రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీం అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌, దుబ్బాక ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి గరీమా అగర్వాల్‌, ఏఆర్‌ఓ వెంకట్‌ రెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు