-

రాష్ట్రంలో అవినీతి పాలన

28 Nov, 2023 06:58 IST|Sakshi
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

బీజేపీని గెలిపిస్తే బీసీ అభ్యర్థే సీఎం

కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

సిద్దిపేట కమాన్‌: రాష్ట్రంలో బీజేపీని గెలిపిస్తే బీసీని ముఖ్యమంత్రి చేయడానికి అధిష్ఠానం సిద్ధంగా ఉందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అన్నారు. సిద్దిపేట బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డికి మద్దతుగా పట్టణంలో సోమవారం నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందన్నారు. యువత పోరాటంతో తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ ఉద్యోగాల భర్తీని మరిచిపోయారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే దళితబంధు పథకాన్ని మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సీఎం విఫలమయ్యారని అన్నారు. నేటి రజాకారులైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నుంచి విముక్తి కలగాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తామన్నారు. ఆడపిల్ల పుడితే రూ.2లక్షలు, ప్రతీ మహిళకు రూ.2500 చేయూత పథకం ద్వారా అందజేస్తామన్నారు. రూ.400కే గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని, చమురు ధరలు తగ్గిస్తామని, డిగ్రీ చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవిత ఉందని, ఈ కేసులో ఎవరున్నా చట్టప్రకారం వదిలి పెట్టేది లేదన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రోడ్డు షో రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ చౌరస్తా నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో నాయకులు ఉపేందర్‌, శ్రీనివాస్‌, వెంకట్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు