కాంగ్రెస్‌కు ఓటేస్తే నార్సింగి చెరువులో వేసినట్లే

29 Nov, 2023 04:36 IST|Sakshi
చేగుంటలో మాట్లాడుతున్న రఘునందన్‌రావు

రామాయంపేట(మెదక్‌): కాంగ్రెస్‌ పార్టీ సుతిలేని సంసారం లాంటిదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే నార్సింగి చెరువులో వేసినట్లు అవుతుందని ఆరోపించారు. దళితున్ని సీఎం చేస్తామని చెప్పి కేసీఆర్‌లాగా తాము మోసం చేయలేమని, బీజేపీ అధికారంలోకి రాగానే బీసీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పేర్కొన్నారు. గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలను బీఆర్‌ఎస్‌ వారు మరిచిపోయారని ఆరోపించారు. అనంతరం బీజేపీ కార్యకర్తలు పట్టణంలో నిర్వహించిన బైక్‌ర్యాలీలో రఘునందన్‌రావు పాల్గొన్నారు.

అభివృద్ధిని అడ్డుకుంది హరీశే..

చేగుంట(తూప్రాన్‌): దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి జరగకుండా మంత్రి హరీశ్‌రావు అడ్డుకున్నాడని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. మంగళవారం చేగుంటలో నిర్వహించిన బైక్‌ర్యాలీలో రఘునందన్‌రావు పాల్గొని మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నాటినుంచి తాను చేగుంట డిగ్రీ కళాశాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్నారని విమర్శించారు. తాను గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.100కోట్ల కేంద్రం నిధులు మంజూరి చేయించానన్నారు. ఎంపీగా గెలిచి తొమ్మిదేళ్లయినా చేగుంట–మెదక్‌ రోడ్డులో రైల్వే బ్రిడ్జి గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఉద్యమకారుడు దివంగత నేత రామలింగారెడ్డి కుటుంబాన్ని మంత్రి హరీష్‌రావు నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను ఓడించడానికి కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ రామచంద్రం, బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భూపాల్‌, మాజీ సర్పంచులు బాలచంద్రం, రఘువీర్‌రావు, ప్రతాప్‌రెడ్డి, జగన్‌గౌడ్‌, వెంగళ్‌రావు, కర్నపాండు పాల్గొన్నారు.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు

మరిన్ని వార్తలు