ప్రజలు మార్పు కోరుతున్నారు

29 Nov, 2023 04:36 IST|Sakshi
నీలం మధు ముదిరాజ్‌

ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రజలస్పందన ఎలా ఉంది?

నీలం మధు: అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారు. కుల మతాలకతీతంగా పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా నా ప్రచారానికి స్వాగతం పలికారు. నాకు ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి నేను ఊహించిన దాని కంటే ఎక్కువగా ఆదరించారు, అభిమానించారు. కాంగ్రెస్‌ కారణంగా కొంత ఆలస్యం అయినప్పటికీ అన్ని విషయాలు అర్థం చేసుకొని నా ప్రచారానికి విశేషంగా స్పందించారు. కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు కలిగింది. ఎంతోమంది వివిధ పార్టీల నుంచి బీఎస్పీలో చేరారు. ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని స్వచ్ఛందంగా యువకులు, మహిళలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశించిన నాకు అది రాకపోవడంతో స్వతంత్రంగా నియోజకవర్గ ర్యాలీ చేస్తూ కాలినడకన ప్రచారం ప్రారంభించాను. అది మీ అందరికి తెలిసిందే, అయితే కాంగ్రెస్‌ నాయకులు నన్ను పార్టీలోకి ఆహ్వానించి టికెట్‌ ఇస్తామని చెప్పి మోసం చేశారు. బీఎస్పీ నాకు టికెట్‌ ఇచ్చింది. నేను ఏనుగు గుర్తుపై పోటీ చేస్తునట్లు ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాను. ప్రజలు మంగళహారతులు ఇచ్చి నాకు స్వాగతం పలికారు. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు నాపై చూపెట్టిన అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఏనుగు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నాను.

మీకు పోటీ ఎవరితో ఉంది అని భావిస్తున్నారు?

● ప్రజల సంపూర్ణ మద్దతు నాకు ఉంది. నాకు ఎవరితో పోటీ లేదు. ప్రజలు ఎమ్మెల్యేపై విసుగు చెంది ఉన్నారు. ఆ కుటుంబం ఆగడాలను భరించే స్థితిలో లేరు. ప్రజలు మార్పు కోరుతున్నారు. ఇతర పార్టీల అభ్యర్థులు ప్రజలకు దూరంగా ఉన్నారు. తొలిసారి పోటీలో ఉన్న నాపై పటాన్‌చెరు ఓటర్లు ఆసక్తి చూపారు. ప్రజల కోరిక మేరకు వారికి సేవకుడిగా ఉంటానని ప్రజల నమ్ముతున్నారు.

మీరు గెలిస్తే పటాన్‌చెరు ప్రజలకు

ఏమి చేస్తారు?

● ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తాను. కార్మికులు, పేదలకు వంద గజాల స్థలం ఇవ్వడమే కాకుండా ఇల్లు నిర్మించి ఇస్తాను. కార్మికుల కోసం ఎన్‌ఎంఆర్‌ క్యాంటీన్లను ఏర్పాటు చేసి రూ.5లకే భోజనం అందేలా చేస్తాను. పేదలందరికీ సత్వర న్యాయం అందించేందుకు ప్రత్యేక న్యాయసేవా కేంద్రం ఏర్పాటు చేస్తా. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ గుడ్‌ మార్నింగ్‌ పటాన్‌చెరు నిర్వహిస్తాను. విద్యా రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఉన్నాయి. స్థానిక నిరుద్యోగులకు స్థానిక పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వచ్చిన అన్ని రాష్ట్రాల ప్రజల సంక్షేమానికి కృషిచేస్తాను.

–సాక్షి, పటాన్‌చెరు

మరిన్ని వార్తలు