అభివృద్ధి చూసి ప్రజలు ఆశీర్వదిస్తారు

29 Nov, 2023 04:36 IST|Sakshi

ఎన్నికల ప్రచారం ఎలా సాగింది?

ఎమ్మెల్యే: బ్రహ్మాండంగా సాగింది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు అందరూ చక్కగా పనిచేశారు. నిత్యం ప్రజలతో ఉండే మాకు, ప్రచారానికి అన్ని వర్గాల మద్దతు లభించింది. నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాలను, పట్టణాల ప్రజలకు కారు గుర్తు పై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశాం.

పదేళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరిగిందని భావిస్తున్నారా?

ఎమ్మెల్యే: లేదు. ప్రజలకు దూరంగా ఉండే వారికి, అలాంటి పార్టీ ప్రభుత్వాలకు సమస్య ఉంటుంది. అన్ని వర్గాల కష్టసుఖాల్లో తోడుగా ఉండే మా ప్రభుత్వానికి ఆ పరిస్థితి లేదు.

హ్యాట్రిక్‌ సాధిస్తే చేపట్టనున్న పనుల వివరాలు తెలపండి?

ఎమ్మెల్యే: ప్రజలందరికీ అందుబాటులో ఉంటా. నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. కేసీఆర్‌ ఆశీస్సులతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.

మీకు పోటీ ఎవరితో ఉంది?

ఎమ్మెల్యే: ఎవరితోనూ లేదు. రెండు, మూడు స్థానాల కోసం ఇతర పార్టీలు పోటీ పడుతున్నాయి.

గెలుపుపై అంతా ధీమాగా ఉన్నారు. కారణం చెప్పండి?

ఎమ్మెల్యే: బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు మా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పటి వరకు ప్రతీ రోజూ ప్రజల మధ్యే ఉన్నా. ప్రజలకు సేవకుడిగా పనిచేస్తున్న. పదేళ్లలో జరిగిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. అన్ని వర్గాలను కేసీఆర్‌ సమానంగా చూస్తున్నారు. క్రిస్మస్‌, రంజాన్‌, బతుకమ్మ పండుగలను ఘనంగా నిర్వహించాం. అన్ని వర్గాల ఆశీర్వాదాలు మాపై ఉన్నాయి.

యువత మీ పార్టీపై అసంతృప్తితో ఉంది?

ఎమ్మెల్యే: ఉద్యోగాల కల్పన, కొత్త పరిశ్రమల స్థాపనతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. సొంత నిధులతో వందలాది మందికి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాను. దివ్యాంగులకు మోటర్‌ సైకిళ్లు ఉచితంగా ఇచ్చాను. యువతకు స్థానిక పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పించాం.

గ్రామాలు, పట్టణాలుగా రూపాంతరం చెందుతున్నాయి ట్రాఫిక్‌ సమస్యల తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు లేవు?

ఎమ్మెల్యే: గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రోడ్లు వేశాం. కొత్త రోడ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. ఇటీవల కేసీఆర్‌ పటాన్‌చెరుకు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు రోడ్ల అభివృద్ధికి నిధులుకావాలని అడిగితే వాటిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు మరోసారి ఈ ప్రభుత్వాన్ని బలపరిస్తే నిరంతరం అభివృద్ధి కొనసాగుతుంది.

–సాక్షి, పటాన్‌చెరు

మరిన్ని వార్తలు