అటవీ సంరక్షణలో  పోలీసుల భాగస్వామ్యం

19 Nov, 2020 08:31 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి. చిత్రంలో పీసీపీఎఫ్‌ శోభ, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి

డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడి

అడవుల ‘పునరుజ్జీవం’ అద్భుతం

అందుకే అంతర్జాతీయ గుర్తింపు

గజ్వేల్‌లో ఐపీఎస్‌లతో కలసి పర్యటన

గజ్వేల్‌: అడవుల పునరుజ్జీవం, సంరక్షణలో పోలీసు శాఖ సైతం తనదైన పాత్రను పోషించనున్నదని, ఈ దిశలో త్వరలోనే కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో బృందంగా ఏర్పడి కార్యాచరణ ప్రారంభిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనల మేరకు బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆర్‌.శోభ, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, రాష్ట్రంలోని సీనియర్‌ ఐపీఎస్‌లతో కలసి పర్యటించారు.

ఈ సందర్భంగా వారు ఫారెస్ట్రీ కళాశాల, పరిశోధన కేంద్రం, అటవీ సహజ పునరుద్ధరణ (ఏఎన్‌ఆర్‌), కృత్రిమ పునరుద్ధరణ (ఏఆర్‌) పనులు, కొండపోచమ్మ సాగర్, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్, నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలు, ఎడ్యుకేషన్‌ హబ్, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, మిషన్‌ భగీరథ హెడ్‌ వర్క్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఏఎన్‌ఆర్, ఏఆర్‌ విధానాల ద్వారా అడవుల అభివృద్ధి చూసి అశ్చర్యం కలిగిందన్నారు. ఇదే తరహా కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో జరిగేలా తమ శాఖ తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలోని 23 వేల హెక్టార్లలోని అడవులకుగానూ 21 వేల హెక్టార్లల్లో అటవీ పునరుజ్జీవ కార్యక్రమాలు జరిగాయన్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు.

అలాగే కొండపోచమ్మసాగర్, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్, ఎడ్యుకేషన హబ్, మిషన్‌ భగీరథ లాంటి నిర్మాణాలు రాష్ట్రానికే తలమాణికంగా నిలిచియన్నారు. అభివృద్ధిని పరుగులెత్తించడంలో కీలక భూమిక పోషించిన కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని ఈ సందర్భంగా డీజీపీ అభినందించారు. పీసీపీఎఫ్‌ ఆర్‌.శోభ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం జరిగిందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి సీనియర్‌ ఐపీఎస్‌లతో కలసి ముందుగా ములుగులోని ఫారెస్ట్రీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని సందర్శించారు. ఆ తర్వాత అదే మండలంలోని తుని్క»ొల్లారం గ్రామంలో కొండపోచమ్మసాగర్‌ ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని పరిశీలించారు.

ఆ తర్వాత మర్కుక్‌లోని కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఇది పూర్తయ్యాక సింగాయపల్లి అటవీ ప్రాంతంలో 159 హెక్టార్లలో సాగిన అటవీ సహజ పునరుత్పత్తి తీరును పరిశీలించారు. సంగాపూర్‌లో 105 హెక్టార్లలో చేపట్టిన ఏఆర్, కోమటిబండలో 160 హెక్టార్లలో చేపట్టిన ఏఆర్, మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌ ప్రాంతంలో 55 ఎకరాల్లో చేపట్టిన ఏఆర్‌ ప్లాంటేషన్‌ తీరును పరిశీలించారు. గజ్వేల్‌లో బాల, బాలికల ఎడ్యుకేషన్‌ హబ్‌ను బస్సుల్లోంచి పరిశీలించారు. డబుల్‌ బెడ్‌రూం మోడల్‌ కాలనీని పరిశీలించారు.
 

మరిన్ని వార్తలు