క్యాండీస్‌ తినటమే పని.. జీతం రూ.61 లక్షలు.. మినిమమ్‌ ఏజ్ ఐదేళ్లే!

2 Aug, 2022 20:58 IST|Sakshi

ఒట్టావా: ఒళ్లు వంచి రోజంతా కష్టపడినా జీతం అంతంతమాత్రమేనని చాలా మంది బాధపడుతుంటారు. అయితే.. తినటమే పనిగా ఉంటే.. దానికి లక్షల్లో జీతం వస్తే.. ఆ ఆలోచనే ఎంతో అద్భుతంగా ఉంది కదా? అవునండీ.. అలాంటి ఉద్యోగాలూ ఉన్నాయి. ఓ ఛాక్లెట్ల తయారీ సంస్థ ‘చీఫ్‌ క్యాండీ టేస్టర్‌’ కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. క్యాండీలు(మిఠాయిలు, ఛాక్లెట్లు) తినటమే ఆ ఉద్యోగం. జీతం కూడా భారీగానే ఇస్తోంది. ఏడాదికి రూ.61 లక్షలు మరి. క్యాండీలు అంటే ఇష్టపడే వారు వెంటనే ఈ ఆఫర్‌ను ఒడిసిపట్టండి మరి. 

కెనడాకు చెందిన క్యాండీ ఫన్‌హౌస్‌ అనే ఆన్‌లైన్‌ రిటైలర్‌ సంస్థ ఛాక్లెట్స్‌ నుంచి వివిధ రకాల స్వీట్లు తయారు చేస్తోంది. చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌ను నియమించుకోవాలని భావిస్తోంది. అందుకు 1,00,000 కెనెడియన్‌ డాలర్లు(సుమారు రూ.61.14 లక్షలు) ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ వివరాలను గత జులైలో లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది సంస్థ. తల్లిదండ్రుల అనుమతితో 5 సంవత్సరాల వయసు పైబడిన వారంతా ఈ ఉద్యోగానికి పోటీ పడొచ్చు. 

ఇప్పటికే పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. భారీస్థాయిలో దరఖాస్తులు వస్తాయని తాము ఊహించలేదని సీఈఓ జమిల్‌ హెజాజి పేర్కొన్నారు. ఒక చీఫ్‌ క్యాండీ ఆఫీసర్‌గా నెలకి 3,500 పీసులు తినాలి. రోజుకు 117 అన్న మాట. అయితే.. అవి చాలా ఎక్కువని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. ఈ ఉద్యోగానికి పెద్ద వారితో పాటు చిన్న పిల్లలు సైతం దరఖాస్తులు పంపించారు. తమ పిల్లలు దరఖాస్తు చేస్తున్న వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు తల్లిదండ్రులు.

ఇదీ చదవండి: Viral Video: ‘మై దునియా సే నికల్‌ జావూంగా​‍’.. పిల్లాడి హోమ్‌ వర్క్‌ ఫ్రస్ట్రేషన్‌ చూడండి!

మరిన్ని వార్తలు