వైరల్‌ వీడియో.. దొంగతనం చేసిన ఏనుగు

12 Nov, 2020 15:59 IST|Sakshi

పట్టపగలు అందరూ ఉండగానే ఏభయం లేకుండా నడిరోడ్డులో దొంగతనం జరిగింది. ఈ దొంగతనం జరిగినట్టు వీడియో ఫుటేజ్‌ కూడా ఉంది. అది అందరికీ తెలుసు. కానీ ఎవరూ దాని గురించి కంప్లయింట్‌ ఇవ్వలేదు. కానీ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఏం దొంగతనం జరిగింది. ఎవరు చేశారని అనుకుంటున్నారా. ఇదొక అరటి పండ్ల దొంగ ఏనుగు కథ. అవును.. మీరు చదివింది నిజమే. ఒక దొంగ ఏనుగు రోడ్డుపై వెళ్తున్న కారును ఆపి మరీ అరటి పండ్లను కాజేసింది. శ్రీలంక లోని కటరంగమా ప్రాంతంలోని రోడ్డుపై ఈ సంఘటన జరిగింది.

అటుగా వెళ్తున్న ఒక ప్యాసింజర్‌ బస్‌ రోడ్డుకడ్డంగా నిల్చున్న ఏనుగును చూసి కొద్దిగా వాహన స్పీడ్‌ను తగ్గించింది. అదే అదనుగా వాహనాన్ని చేరిన ఏనుగు బస్‌లోని కిటికీలోకి తన తొండాన్ని పెట్టి అందులోని అరటిపండ్లను తీసుకోవడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో బస్‌ డ్రైవర్‌ తల ఆ తొండానికి బిగుసుకుపోయినట్లై, విడిపించుకోడానికి నానా తిప్పలు పడ్డాడు. ఇదంతా చూస్తున్న ప్రయాణికులు హడలిపోయి, ఏనుగుకు అరటి పండ్ల గెలను అందించగానే అది తప్పుకుంది. దీంతో, బతుకుజీవుడా అంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి బండి కదిలించారు. రెండేళ్ల క్రితం నాటి ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఆఫీసర్‌ పర్వీన్‌ కస్వాన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్‌లోడ్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే 2.5 లక్షలకు పైగా వ్యూస్‌ని సంపాదించుకొని, టన్నుల కొద్ది కామెంట్లను సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు