చిరుత పిల్లను బ్లాంకెట్‌లో చుట్టిన మహిళ.. వైరల్‌ వీడియో

29 Sep, 2021 21:11 IST|Sakshi

ముంబై: కొన్ని రోజులుగా ముంబైలో కురుస్తున్న వర్షాల వలన ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైన సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఒక్కొసారి అడవికి సమీపంలో ఉన్న ప్రాంతాలలోని జంతువులు దారితప్పి రోడ్లపైకి వచ్చిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా, అలాంటి సంఘటన ఒకటి ముంబైలోని ఆర్‌మీల్స్‌ కాలనీలో జరిగింది.  ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆర్‌మీల్స్‌కాలనీ అడవికి సమీపంలో ఉంటుంది. ఈ క్రమంలో ఒక చిరుత పిల్ల తన తల్లినుంచి తప్పిపోయి.. జనావాసాల సమీపంలోకి వచ్చింది. పాపం.. ఆ చిరుత పిల్ల తల్లి కోసం అటు ఇటూ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ చిరుత పిల్లను ముంబాలికర్స్‌ అనే మహిళ గమనించింది. ఆ తర్వాత ఆ కూనను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లింది. వర్షంలో తడిసిన కూనకు బ్లాంకెట్‌లో చుట్టి సపర్యలు చేసింది.

ఆ తర్వాత అటవీ అధికారులకు,పోలీసులకు సమాచారం అందించింది. మహిళ ఇంటికి చేరుకున్న అధికారులు ఆ చిరుత పిల్లను తిరిగి అడవిలో వదిలి.. దాని తల్లి దగ్గరకు చేర్చే ప్రయత్నాలు చేస్తూన్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీన్ని చూసిన నెటిజన్లు చిరుతపిల్ల ప్రాణాలు కాపాడిన మహిళను ప్రశంసిస్తున్నారు. ఎలాగైనా అటవీ అధికారులు చిరుతపిల్లను దాని తల్లి దగ్గరకు చేర్చండని అధికారులను కోరుతూ నెటిజన్లు కామెంట్‌లు చేస్తున్నారు.  

చదవండి: ‘వీడియో చూస్తుంటే.. కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి’

మరిన్ని వార్తలు