వైరల్‌: కేరళ పోలీసుల స్టెప్పులు.. మారండయ్యా!

30 Apr, 2021 13:50 IST|Sakshi

తిరువనంతపురంభారతదేశంలో కోవిడ్ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో విలయ తాండవం చేస్తోంది. ఇంతలా విజృంభణకు ప్రజలు నిబంధనలను కచ్చితంగా పాటించకపోవడమే ఓ కారణమనే చెప్పాలి.  అధికారులు, డాక్టర్లు ఎంత చెబుతున్నా కొందరు నిబంధనలు పాటించకుండా వారితో పాటు ఇతరులను కూడా  ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేరళ పోలీసులు వినూత్న ప్రయత్నంగా ఓ వీడియో చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది.

ఏముంది ఈ పాటలో..
ఇటీవల తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఎంజాయి ఎంజామి’ పాట తెలిసే ఉంటుంది. కేరళ పోలీసులు ఈ పాట లిరిక్స్‌ను మార్చి కరోనా నిబంధనలు పాటించాలని అర్థం వచ్చేలా రూపొందించారు. దానికి తగ్గట్టుగానే డ్యాన్స్ చేసిన ఓ వీడియోను తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ పాటలో.. ‘‘కొవిడ్‌ అడ్డుకట్టకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్‌ తప్పకుండా ధరించాలి. పోలీసులకు, సమాజానికి భయపడి మాత్రమే మాస్క్‌ పెట్టుకోవడం కాకుండా కరోనా అంతమయ్యేవరకు దాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా శానిటైజర్‌ వెంట తీసుకువెళ్లాలి. ప్రస్తుతమున్న ఆపత్కర పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అది మన  ప్రాణాలనే  తీస్తుంది. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్‌ వస్తోంది. అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి. అందరం కలిసి కరోనా రహిత భవిష్యత్తు కోసం పోరాడదాం’’ అంటూ ఓ సందేశాన్ని వీడియో రూపంలో రూపొందించారు.  ఈ వీడియోకు..  ‘కరోనాపై కలిసిపోరాడుదాం.. కేరళ పోలీసులు ఎల్లప్పుడూ మీ వెంటే’ అనే టైటిల్‌తో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 

ఈ తరహా అవగాహన మొదటి సారి కాదు
కేరళ పోలీసులు కోవిడ్‌పై అవగాహనకు ఇటువంటి వీడియో రూపొందించడం ఇదే తొలిసారి కాదు. గతేడాది మార్చిలోనూ ‘హ్యాండ్ వాష్ డ్యాన్స్’ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజా వీడియోకు పోలీస్ మీడియా సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ వీపీ ప్రమోద్ కుమార్ దర్శకత్వం వహించగా.. హేమంత్ నాయర్, షిఫిన్ సీ రాజ్, రాజీవ్ సీపీలు కెమెరా మెన్‌లుగా వ్యవహరించారు. డిపార్ట్‌మెంట్‌కే చెందిన ఆదిత్య ఎస్ నాయర్, రాజేష్ లాల్ వమ్షాలు స్వరాలు సమకూర్చగా.. నిలా జోసెఫ్, నహూమ్ అబ్రహామ్‌ అనే ఉద్యోగులు గీతాన్ని ఆలపించారు.

( చదవండి: ‘బరాత్‌’లో పీపీఈ కిట్‌తో చిందేసిన అంబులెన్స్‌ డ్రైవర్‌ )

మరిన్ని వార్తలు