యాక్టింగ్‌ ఇరగదీశాడు.. అయినా పోలీసులకు దొరికిపోయాడు..

17 Apr, 2021 16:34 IST|Sakshi

కేరళ : సినిమాల్లో నటించకపోయినా కొందరు ఆస్కార్‌ నటులు మన మధ్యలోనే ఉన్నారని అప్పడప్పుడు మన స్నేహితులనో , బంధువులనో చూస్తే అనిపిస్తుంది. అలాంటి ఆస్కార్‌ ఆర్టిస్ట్‌ నటనే ఇప్పుడు వీడియో రూపంలో వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. వీడియో చూసిన వారందరు ఆ వ్యక్తి నటనకు 'ఏం నటన గురూ.. ఇరగదీశావ్'.. ‘నువ్వు కేక అంతే’ అంటూ కితాబిస్తున్నారు. నెటిజన్లేంటి ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ పొగుడుతోంది. ఇంతకీ అసలేం అక్కడ ఏం జరిగింది. అంతటి ఆస్కార్‌ నటన ఎవరిదీ అనుకుంటున్నారా.... అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

కేరళ పోలీస్ శాఖ తమ ఫేస్ బుక్ ఖాతాలో శుక్రవారం ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియో కాస్తా ఫన్నీగా ఉండటం, ఆ ఫన్నీ వీడియోకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ కూడా తమదైన శైలిలో సెటైరికల్ కామెంట్స్, బ్యాక్ గ్రౌండ్ జోడించడంతో ఇట్టే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఏప్రిల్ 15వ తారీఖున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ముగ్గురు వ్యక్తులు ఒకే స్కూటీపై వెళ్తున్నారు. వాళ్లకు కొద్ది దూరంలోనే ఎదురుగా ఓ పోలీస్ వ్యాన్ వస్తోందని గ్రహించారు. ఆ స్కూటీని నడిపే వ్యక్తికి హెల్మెట్ లేదు. ఏ ఒక్కరూ మాస్క్‌ ధరించలేదు. పోలీసులకు చిక్కితే వాళ్ల లాఠీలకు పని చెబుతారని గ్రహించి, ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అందులో ఇద్దరు పరారయ్యారు. 

 ఓ వ్యక్తి మాత్రం సాధారణ పౌరుడిగా వెనక్కు నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో తన జేబులో ఉండే మాస్కును తీసి పెట్టుకున్నాడు. పోలీస్ వ్యాన్ అతడి పక్కగా వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పోలీస్ వ్యాన్ దగ్గరకు వెళ్లి ఏమీ తెలియనట్లు వారితో మాట్లాడాడు. ఇంకేముంది హమ్మయ్యా బతికి పోయామని అనుకున్నాడు. కానీ ఈ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డవడంతో అతడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ వీడియోను పోలీసులు  'అమాయకుడిగా నటిస్తున్న ఓ బ్రదర్ను చూడండంటూ'  శీర్షిక‌ పెట్టి నెట్టింట పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది‌. ఆ వ్యక్తి నటనకు.. నువ్వు కేక అంటూ ఫన్నీ కామెంట్స్‌ వస్తున్నాయి.

( చదవండి: సెలవు కోసం భార్యకు విడాకులిచ్చిన భర్త...అది కూడా 3 సార్లు )

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు