పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్‌

20 Jun, 2021 19:28 IST|Sakshi

భువనేశ్వర్‌: శ్వాస అందక.. ఎవరైనా ప్రాణాపాయ స్ధితిలో ఉంటే నోట్లో నోరు పెట్టి ఊపిరి అందించడం చూసివుంటాము. అయితే, జంతువులు, సరిసౄపాలకు ఆ సమస్య వస్తే సాయం అందించేదెవరు? వాటి ప్రాణం నిలిపేదెవరు? ముఖ్యంగా విష సర్పాలు కనిపిస్తేనే అంత దూరం పరుడెత్తడం మానవ నైజం. కానీ, ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఓ యువకుడు ఏకంగా ప్రాణాపాయంలో ఉన్న పాముకు ఊపిరి ఊది ప్రాణం పోసాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మల్కన్‌గిరిలోని నౌగుడా గ్రామంలో ఓ ఇంట్లో పాము చొరబడింది. దానిని చూసి స్థానికులు వణికిపోయారు.

వెంటనే స్నేక్‌ క్యాచర్‌ స్నేహాశీష్ అనే యువకుడికి సమాచారం ఇచ్చారు. అతడు స్థానికంగా పాములను పట్టి అడవుల్లో వదిలిపెడుతుంటాడు. ఇంట్లోకి చొరబడిన పామును చాకచక్యంగా పట్టి బయటకు తీసుకొచ్చాడు. అది దాదాపు 10 అడుగుల పొడవు ఉంది. కానీ ఆ పాము అప‌స్మార‌క స్థితికు చేరుకుంది. శ్వాస అంద‌క పాము విలవిల్లాడుతోందని గుర్తించిన.. స్నేహాశీష్ ఊపిరి ఊదితే బతుకుతుందని అనుకున్నాడు.

కానీ, పాము ఊపిరి ఊదడం ఎలా అని చూస్తుండగా.. అక్కడ  ఓ స్ట్రా కనిపించింది. దాన్ని తీసుకుని పాముని పట్టుకుని దాని నోట్లోకి స్ట్రా పెట్టి ఊపిరి ఊదాడు. అలా కొన్నిసార్లు చేసినా పాము కదల్లేదు. దాదాపు 15 నిమిషాలపాటు  స్నేహాశీష్ పాముకు ఊపిరి అందిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఆ పాము స్పృహ‌లోకి వ‌చ్చింది. పాముకు ప్రాణాపాయం తప్పిందనుకున్న తర్వాత స‌మీప అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు. ఇక పాముకు ప్రాణం పోసిన యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి:Odisha: హిజ్రాలకు పోలీసు ఉద్యోగాలలో అవకాశం..

మరిన్ని వార్తలు