‘భార్య అలిగి వెళ్లిపోయింది.. సెలవు ఇవ్వండి ప్లీజ్‌’.. క్లర్క్‌ లేఖ వైరల్‌

3 Aug, 2022 19:56 IST|Sakshi

లక్నో: ఏదైనా పని ఉందనో, లేక ఆరోగ్యం బాగోలేదనో సెలవు తీసుకుంటారు ఎవరైనా. కానీ, తన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయిందని, బుజ్జగించి తిరిగి తీసుకొచ్చేందుకు మూడు రోజులు సెలవు కావాలని ఓ ప్రభుత్వ ఉద్యోగి కోరాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఉన్నతాధికారులకు లేఖ రాశాడు. ప్రస్తుతం ఆ లీవ్‌ లెటర్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో జరిగింది. 

ప్రేమ్‌ నగర్‌ బ్లాక్‌ అభివృద్ధి అధికారి (బీడీఓ)కి మంగళవారం లేఖ రాశారు శాంషద్‌ అహ్మెద్‌. తనకు సెలవు ఎంత ముఖ్యమో వివరించారు. తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆమెను బుజ్జగించి తిరిగి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు అహ్మెద్‌. ‘నేను మానసికంగా బాధపడుతున్నా. ఆమెను బుజ్జగించి తీసుకొచ్చేందుకు వారి ఊరికి వెళ్లాలి. అందుకోసం ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు అత్యవసర సెలవు, నగరం విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.’అని హిందీలో లేఖ రాశారు అహ్మెద్‌. క్లర్క్‌ అభ్యర్థనను బీడీఓ అధికారి ఆమోదించారు.

ఇదీ చదవండి: బాధలో ఉన్న వ్యక్తిని తల్లిలా ఓదార్చిన కోతి.. నెటిజన్లు ఫిదా!

మరిన్ని వార్తలు