ప్రపంచంలోనే మోస్ట్‌ కాస్ట్‌లీ బిర్యానీ ఇదే..

23 Feb, 2021 18:30 IST|Sakshi

దుబాయ్‌ : ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లినా, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకోవాలనుకున్నా మనలో చాలా మందికి గుర్తొచ్చేది బిర్యానీ'. అన్ని రుచుల్లోనూ బిర్యానీ రుచి వేరయా అనడంలో ఎలాంటి సందేహం లేదు. విదేశాల్లోనూ బిర్యానీ లవర్స్‌ బోలెడు మంది ఉన్నారు. సాధారణంగా మన దగ్గర అయితే ప్లేటు బిర్యాని ధర రూ. 100 నుంచి రూ. 1000 దాకా ఉంటుంది. అందులో ఉపయోగించే మాంస పదార్థాలను బట్టి ఈ ధర కాస్త అటూఇటూగా ఉంటుంది. కానీ దుబాయ్‌లో దొరికే ఓ స్పెషల్‌ బిర్యానీ ధరెంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

అవును..దుబాయిలోని బాంబే బరో అనే రెస్టారెంట్‌లో లభించే బిర్యానీ ధర ఏకంగా  1000 దిర్హామ్‌లు. అంటే భారత కరెన్సీలో దాదాపు 19,700ల రూపాయలు. ‘రాయల్‌ గోల్డ్‌ బిర్యానీ’తో పిలిచే ఈ బిర్యానీ..పేరుకు తగ్గట్లుగానే గోల్డ్‌తో ఉంటుంది. అంటే ఎంతో రుచికరమైన బిర్యానీని 23 కేరట్ల గోల్డ్‌ ప్లేట్‌లో వడ్డిస్తారు. అందుకే ఇంత ఎక్కువ ధరన్నమాట. అంతేకాకుండా కాస్ట్‌కు తగ్గట్లు గానే ఈ బిర్యానీకి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సాధారణంగా బిర్యానీలో ఒకే రకమైన అన్నం ఉంటుంది. కానీ రాయల్‌ గోల్డ్‌లో మాత్రం బిర్యానీ రైస్, కీమా రైస్, వైట్ రైస్, సాఫ్రాన్ (కుంకుమ పువ్వు) రైస్.. ఇలా మీ టేస్ట్‌కు తగ్గట్లు సర్వ్‌ చేస్తారన్నమాట.


ఈ బిర్యానీ బరువు సుమారుగా 3 కేజీలు ఉంటుంది. దీంతో పాటు  బంగారం రేకుల్లో చుట్టిన కశ్మీరీ లాంబ్ సీక్స్ కబాబ్స్, రాజ్‌పుత్ చికెన్ కబాబ్స్, ఢిల్లీ లాంబ్ చాప్స్, మొగలాయ్ కోఫ్తా, మలాయ్ చికెన్ రోస్ట్ కూడా ఉంటాయి. బిర్యానీపై  బంగాళాదుంపలు, జీడిపప్పు,గుడ్లు,దానిమ్మ, పుదీనాలతో ఎంతో కలర్‌ఫుల్‌గా, అందంగా దీన్ని తీర్చిదిద్దుతారు. అంతేకాకుండా ఈ బిర్యానీ సర్వ్‌ చేయడానికి వచ్చే రెస్టారెంట్‌ సిబ్బంది సైతం బంగారు పూత కలిగిన డ్రెస్‌ కోడ్‌ను ధరిస్తారట. ప్రపంచంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన బిర్యానీ ఇదేనని రెస్టారెంట్‌  నిర్వాహకులు చెబుతున్నారు. మీరు కూడా బిర్యానీ ప్రేమికులైతే, దుబాయ్‌కి వెళ్లినప్పుడు ఈ గోల్డ్‌ బిర్యానీని ఓ పట్టుపట్టండి. 

చదవండి : (దారుణం: ప్రియుడిని చంపి ఆ భాగాలతో బిర్యానీ..)
(ప్రతీ సెకనుకో బిర్యానీ : స్విగ్గీ సీక్రెట్‌)

మరిన్ని వార్తలు