సంస్కృతంలో ప్రమాణం చేసిన న్యూజిలాండ్ ఎంపీ

25 Nov, 2020 17:46 IST|Sakshi

ఆక్లాండ్‌: ప్రవాస భారతీయుడు డాక్టర్‌ గౌరవ్​ శర్మ మరోసారి ప్రపంచం మొత్తం మన భారతదేశం గురించి మాట్లాడుకునేలా చేశారు. న్యూజిలాండ్​లో గత నెలలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన గౌరవ్​ శర్మ.. తాజాగా ఆ దేశ పార్లమెంట్​లో ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో వింత ఏముందని అనుకుంటున్నారా.. ఆయన సంస్కృతం భాషలో ప్రమాణస్వీకారం చేశారు. మొట్టమొదటిగా న్యూజిలాండ్​ అధికారిక భాష మోరీలో ఆయన ప్రమాణం చేశారు. ఆ తరువాత  సంస్కృతంలోనూ ప్రమాణం చేశారు. హిందీలో ఎందుకు ప్రమాణస్వీకారం చేయలేదని ఈ సందర్భంగా ఓ నెటిజన్​ గౌరవ్​ను ట్విటర్‌లో అడిగారు. ముందుగా తాను హిందీలోనే ప్రమాణస్వీకారం చేద్దామనుకున్నానని.. సంస్కృతం అన్ని భాషలకు మూలం కాబట్టి దానిని ఎంచుకున్నట్లు తెలిపారు.

20 ఏళ్ల క్రితం భారత్‌ నుంచి వెళ్లి న్యూజిలాండ్‌లో స్థిరపడ్డ గౌరవ్‌ అధికార లేబర్‌ పార్టీ నుంచి పోటీచేసి ప్రత్యర్థి టిమ్‌ మసిండోపై 4,425 ఓట్లు తేడాతో విజయం​ సాధించారు. గౌరవ్​ విజయానికి ముఖ్య కారణం ఆయన సామాజిక దృక్పథం. కరోనా సమయంలో ఆయన విశేష సేవలందించారు.  2015లో నేపాల్‌లో సంభవించిన భారీ భూకంపంలో ఇళ్లు కోల్పోయిన ప్రజలకు అండగా నిలిచి ప్రజల దృష్టిలో రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు, ఇంత చిన్న వయసులో ఎంపీగా బాధ్యతలు చేపట్టి రికార్డ్‌ సృష్టించారు.
 

>
మరిన్ని వార్తలు