కాక రేపుతున్న పాపడం.. 

26 Oct, 2020 16:10 IST|Sakshi

న్యూఢిల్లీ: భారతీయ ఆహారంలో పాపడాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వెజిటేరియన్‌ భోజనంలో పాపడం తప్పని సరి. అయితే గత కొద్ది రోజులుగా పాపడం ఏదో ఓ కారణంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. పాపడ్‌తో కరోనా పరార్‌.. కోవిడ్‌ బారిన పడకుండా ఉండాలంటే పాపడాలు తినాలంటూ ఓ మంత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. తాజాగా పాపడం మరో సారి వార్తల్లో నిలిచింది. 2014లో చిన్నారుల కోసం కంపోజ్‌ చేసిన ఓ పాపడం పాట ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. విగ్లెస్‌ అనే పిల్లల సంగీత బృందం సభ్యుడైన ఆంథోనీ డోనాల్డ్‌ జోసెష్‌ ఫీల్డ్‌ అనే ఆస్ట్రేలియా సంగీతకారుడు దీనిని స్వరపరిచారు. దాదాపు ఆరేళ్ల నాటి పాట తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడమే కాక వివాదాస్పదంగా మారింది. ఇక ఈ వీడియోలో ఆస్ట్రేలియన్ల బృదం "పాపడం" పాటను పాడతారు. దీనిలో ఒక దక్షిణాసియా మహిళ కూడా ఉంది. అయితే ఆమె నోటి వెంట ఎలాంటి పదాలు వెలువడవు.. పైగా ఏదో బలవంతంగా నవ్వుతూ.. ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇవ్వడం వీడియోలో చూడవచ్చు. (చదవండి: ‘ఈ పాపడ్‌తో కరోనా పరార్‌)

ఆమె కాక మిగతా అందరూ "పాపడం" అనే పదాన్ని పదేపదే జపిస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో, ఈ టీంలోని ఒకరు క్రికెట్ బ్యాట్‌ని  ఊపుతూ, పాటను పాడతాడు. ఇది క్రికెట్ పట్ల భారతదేశ ప్రేమను సూచిస్తుంది. సాంస్కృతిక ప్రాతినిధ్యంపై అవగాహన కల్పించడానికి 2014 లో పిల్లల కోసం రాసిన పాట అకస్మాత్తుగా దేశీ సోషల్ మీడియాలో వైరలయ్యింది. దీనిపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ‘2020లో ఇలాంటివి ఇంకా ఏమేం చూడాల్సి వస్తుందో.. మీ ఆలోచన బాగుంది.. ఆచరణ బాగాలేదు.. ఇలాంటి పాటతో పిల్లలకు ఏం బోధించాలనుకుంటున్నారు’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. వివాదం తలెత్తడంతో ఫీల్డ్‌ దీనిపై స్పందించారు. ‘భారతీయ సమాజాన్ని సాంస్కృతికంగా కించపరిచే ఉద్దేశం నాకు లేదు. క్షమించండి’ అని కోరారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా