ఒక్కసారిగా రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. నెల క్రితమే నిర్మించారటా!

17 Jul, 2022 18:23 IST|Sakshi

గాంధీనగర్‌: నాణ్యత లేకుండా నిర్మిస్తున్న రోడ్లు కొద్ది పాటి వర్షానికే కొట్టుకుపోతున్న సంఘటనలు చాలానే చూశాం. అలాంటి సంఘటనే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వెలుగు చూసింది. రహదారి నిర్మించిన నెల రోజులకే డొల్లతనం బయటపడింది. ఇటీవల కురిసిన వర‍్షాలకు రోడ్డు మధ్యలో ఒక‍్కసారిగా పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆదివారం కురిసిన వర్షాలకు నగరంలోని సురభి పార్క్‌ సమీపంలో రోడ్డు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ గొయ్యిలో పూర్తిగా నీటితో నిండిపోయిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ‍్యమాల్లో వైరల్‌గా మారింది. 

మెట్రో రైలు మార్గంలో పిల్లర్‌ నంబర్‌ 123 వద్ద రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు తెలిపారు. ఆ రోడ్డును కేవలం ఒక నెల ముందే నిర్మాణం చేపట్టటం గమనార్హం. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. అయితే.. రోడ్డు మధ్యలో ఒక్కసారిగా కుంగిపోయినప్పుడు అటుగా ఎలాంటి వాహనం వెళ్లకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందన‍్నారు. 

గుజరాత్‌లో కురుస‍్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వల్సాద్‌, నవ్సారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. గురువారం ఒక్కరోజే 11 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 54 మందికి చేరింది. 14 వేల మంది ఇప్పటికీ తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. వర్షాల కారణంగా నాలుగు జాతీయ రహదారులను మూసివేసింది గుజరాత్‌ ప్రభుత్వం.

ఇదీ చదవండి: భారీ మొసలిని బంధించిన అనకొండ.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు