రోడ్లపై చెత్త వేస్తున్నారా? సిగ్గు పడండి, కాకి వీడియో వైరల్‌

3 Apr, 2021 09:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఓ కుండలో అడుగున ఉన్న నీటిని గులకరాళ్ల సాయంతో పైకి తీసుకొచ్చిన కాకి ఎంత తెలివైన జీవో మనం చాలా చిన్నపుడే తెలుసుకున్నాం. ఎంత విసుక్కున్నా..విసిరి కొట్టినా. ఒడుపుగా ఆహారాన్ని అందిపుచ్చుని కవ్విస్తూనే ఉంటుంది. అంతేకాదు తెలివైనదాన్నే కాదు.. నేను చాలా స్మార్ట్‌ అని నిరూపించు కున్న సందర్భాలు కూడా కోకొల్లలు. తాజాగా సామాజిక బాధ్యతను మరిచి ప్రవర్తించే మానవ జాతి సిగ్గు పడేలా చేసిందో కాకి.  తాను సామాజిక జీవినని మరోసారి నిరూపించుకుని అందర్నీ ఫిదా చేస్తోంది. డస్ట్‌బిన్‌ పక్కనే ఉన్నా.. దాన్ని వినియోగించుకోకుండా పక్కన పారేసిన చెత్తను  ఒక్కొక్కటిగా తన ముక్కుతో తీసుకొని  డస్ట్‌బిన్‌లో వేసిన వైనం  ఔరా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో  చక‍్కర్లు కొడుతోంది. 

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా 38 సెకన్ల క్లిప్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఖాళీ డబ్బాలు, చెత్త పేపర్‌ ఇలా ఒక్కొక్కదాన్ని చాలా  స్మార్ట్‌గా  ఏరి డస్ట్‌బిన్‌లో వేసి మరీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసిన తీరు నెటిజనులను ఆకట్టుకుంటోంది. మనుషులు సిగ్గు అనే విషయాన్ని మర్చిపోయారని కాకికి తెలుసు అనే క్యాప్షన్‌తో సుశాంత​ పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్‌ చేయడమే కాదు.. వేగంగా వైరల్ అవుతోంది. సుమారు 2 వేలకు పైగా లైక్‌లను 14వేల వ్యూస్‌తో దూసుకుపోతోంది. కాకి తెలివికి కొంతమంది అబ్బుర పడుతున్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతను ఈ చిన్న జీవి సైతం అర్థం చేసుకుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకుని.. బాధ్యతగా పవర్తిద్దాం అనే సందేశాల వెల్లువ కురుస్తోంది. 

మరిన్ని వార్తలు