వైరల్‌ వీడియో: వావ్‌ భయ్యా! ఏమన్నా క్యాచ్‌ పట్టినవా!

31 May, 2021 17:02 IST|Sakshi

వెల్లింగ్టన్​: సాధారణంగా మనం ఎగ్జిబిషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ రోలర్​ కోస్టర్​, జాయింట్​ విల్స్​.. వంటి రైడింగ్​లు చాలానే చూస్తుంటాం. మనలో చాలా మంది దాంట్లో ఎక్కాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. మరికొందరేమో వీటిని చూస్తేనే  వామ్మో అంటూ భయపడిపోతుంటారు. పొరపాటున అందులో నుంచి కిందపడితే అంతే సంగతులు అని వెనకడుగు వేస్తుంటారు. అయితే, వీటిలో ప్రయాణించే క్రమంలో ఒక్కోసారి కొన్ని ఊహించని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.  

తాజాగా ఇలాంటి అనుకోని సంఘటన తాలూకు వీడియో ఒకటి నెట్టింట వైరల్​గా మారింది. వివరాలు.. న్యూజిలాండ్​లోని బార్సిలోనాలో శామ్యుల్​ కెంఫ్​ అనే వ్యక్తి తన మిత్రులతో కలసి సరదాగా అక్కడి థీమ్​ పార్కులోని రోలర్​ కోస్టర్​ రైడ్​ను ఎంజాయ్​ చేయడానికి వెళ్లాడు. అది యూరప్​లోనే అత్యంత వేగవంతమైన రోలర్​ కోస్టర్​లలో ఒకటి. నిర్వాహకులు దాన్ని గంటకు 83 కిలోమీటర్లు వేగంతో తిప్పుతుంటారు.

ఈ క్రమంలో, కెంఫ్​.. తన మిత్రునితో కలసి వారు ఎంజాయ్​ చేస్తున్న రైడ్​ను సరదాగా వీడియో తీసుకుంటుండగా గాలిలో ఒక ఐఫోన్​ కిందకు పడటాన్ని చూశాడు.  వెంటనే తేరుకొని దాన్ని క్యాచ్​ పట్టేశాడు. కాసేపయ్యాక కెంఫ్​ ఈ ఫోన్​ ఎవరిదా అని చూస్తే..​ తన కన్నా రెండు వరుసల ముందు కూర్చున్న వ్యక్తిదని తెలిసింది. అది అనుకోకుండా అతని జేబులోనుంచి పడిపోయిందని అర్థమైంది.

వెంటనే కెంఫ్‌ అతడికి ఐఫోన్​ను తిరిగి ఇచ్చేయడంతో సదరు వ్యక్తి ధన్యవాదాలు తెలియజేశాడు. కాగా, మిత్రుడు తనరైడ్​ను ఫోన్​లో వీడియో తీస్తుండగా ఈ క్యాచ్​ పట్టడం కూడా రికార్డైంది. ఇప్పుడు గాలిలో పట్టుకున్న ఈ క్యాచ్​ నెట్టింట తెగ వైరల్​గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వావ్​.. భయ్యా ఏమన్నా క్యాచ్​ పట్టావా..’ , ‘ నీ  మంచి తనానికి హ్యట్సాఫ్​’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు