షాకింగ్‌: భార్య ప్రేమను అ‍మ్మకానికి పెట్టి మరీ..

10 Apr, 2021 17:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఫాస్ట్‌ ఫుడ్‌ మీద ఇష్టంతో భార్య పంపే శాండ్‌విచ్‌ అమ్మకం

ఇంట్లో వారి కోసం ఎంతో ప్రేమగా వంట చేస్తారు ఆడాళ్లు. ఏ మాత్రం రుచి తగ్గినా తినే వారి కంటే వండిన వారే ఎక్కువ బాధపడతారు. ఇక భర్తకు, పిల్లల కోసం ప్రత్యేక శ్రద్ధతో లంచ్‌ బాక్స్‌ తయారు చేస్తారు. తినకుండా అలానే తీసుకొస్తే వారి మనసు విలవిల్లాడుతుంది. అలాంటిది ఓ భర్త ఫాస్ట్‌ ఫుడ్‌ మీద ఇష్టంతో భార్య తన కోసం ఎంతో ప్రేమగా వండి పంపిన ఆహారాన్ని అమ్ముకుని.. అలా వచ్చిన డబ్బుతో తనకు నచ్చిన ఆహారం తినేవాడు. ఓ రోజు సడెన్‌గా ఈ విషయం భార్యకు తెలియడంతో ఆమె సోషల్‌ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది. రెడిట్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఆ వివరాలు.. 

‘‘నా భర్తకు ఇంట్లో చేసిన ఆహారం కంటే ఫాస్ట్‌ ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. ఇందుకుగాను రోజుకు 20 డాలర్ల చొప్పున నెలకు 600 డాలర్లు ఖర్చు చేసేవాడు. ప్రస్తుతం మే అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఇది చాలా ఖరీదైన ఏరియా. రెంటు కూడా చాలా ఎక్కువ. దాంతో సొంత ఇల్లు కొందామని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా అవనసర ఖర్చులు తగ్గించి.. పొదుపు చేద్దామని నిర్ణయించుకున్నాం. దాంతో నేను ఇంట్లోనే శాండ్‌విచ్‌ ప్రిపేర్‌ చేస్తాను.. ఫాస్ట్‌ ఫుడ్‌ తినడం మారేయమని నా భర్తని కోరాను. అందుకు తను అంగీకరించాడు. తనకు లంచ్‌ బాక్స్‌లో శాండ్‌విచ్‌ పెట్టి పంపించేదాన్ని’’ అంటూ చెప్పుకొచ్చింది. 

రహస్యం ఎలా భయపడిందంటే...
‘‘ఇలా ఉండగా ఓ రోజు నా భర్త స్నేహితులు మా ఇంటికి డిన్నర్‌కి వచ్చారు. నా వంటను మెచ్చుకున్నారు. అంతేకాక ‘‘మేం ప్రతిరోజు మీ భర్త దగ్గర శాండ్‌విచ్‌ కొంటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. కానీ ధరే కాస్త ఎక్కువ’’ అన్నారు. దాంతో షాకవ్వడం నా వంతయ్యింది. అంటే నా భర్త నేను పంపే శాండ్‌విచ్‌లు తినకుండా అమ్ముతున్నాడని తెలిసింది. తన స్నేహితులు వెళ్లాక దీని గురించి ఆయనని ప్రశ్నించగా.. నేను పంపే శాండ్‌విచ్‌లు అమ్మి.. అలా వచ్చిన డబ్బుతో తనకు ఇష్టమైన ఫాస్ట్‌ ఫుడ్‌ కొనుక్కోని తింటున్నాను అని తెలిపాడు’’ అన్నది.

‘‘నేను ఎంతో ప్రేమగా ఆయన కోసం ఇష్టంగా చేసిన వంటను ఇలా అమ్మకానికి పెట్టడం నాకు ఏం నచ్చలేదు. అంటే పరోక్షంగా ఆయన నా ప్రేమను అమ్మకానికి పెట్టారు. దీని గురించి తెలిసిన నాటి నుంచి నా మనసు మనసులో లేదు. ఇక జీవితంలో తన కోసం వంట చేయకూడదని నిర్ణయించుకున్నాను’’ అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది. ఈ స్టోరి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. భార్యల వంట విలువ మగాళ్లకు ఏం తెలుస్తుంది.. ఒక్కరోజు వారు వంట చేసి.. దాన్ని ఎవరు తినకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అప్పుడు వారికి అర్థం అవుతుంది అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.

చదవండి: ఫాస్ట్‌ ఫుడ్‌ కోసం హెలికాప్టర్‌లో 725 కిమీ..

మరిన్ని వార్తలు