నా బలం.. స్పూర్తి నువ్వే: సీఎం చౌహన్‌

11 Nov, 2020 15:17 IST|Sakshi

భార్యను ప్రశంసించిన మధ్యప్రదేశ్‌ సీఎం

ఉప ఎన్నికల్లో విజయంపై హర్షం

భోపాల్‌: ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆనందంలో ఉన్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తన భార్య సాధ్నాను పొగడ్తలతో ముంచెత్తారు. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన నేపథ్యంలో ‘విజయం సాధించినందుకు అభినందనలు’ అంటూ సాధ్నా బుధవారం తెల్లవారుజామున ట్వీట్‌ చేశారు. తన భర్తకు స్వీట్‌ తినిపిస్తున్న ఫోటోను దీనికి జత చేశారు. ‘నీవేనా బలం, నా ప్రేరణకు మూలం నువ్వే. నా జీవితంలో ప్రతీ విజయంలో నీ సహకారం ఉంది. నీవు నాతో ఉంటే ఎల్లప్పుడు నాదే విజయం’ అంటూ భార్య ట్వీట్‌కు శివరాజ్‌ సింగ్‌ సమాధానమిచ్చారు.

అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటే తప్పక గెలవాల్సిన ఉప ఎన్నికల్లో బీజేపీ 28 సీట్లకు గానూ 19 స్థానాల్లో గెలిచి, ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకోగలిగింది. కాంగ్రెస్‌ పార్టీ చావు దెబ్బతిని 8 సీట్లకే పరిమితమైంది. 25 మంది శాసన సభ్యుల రాజీనామా, ముగ్గురు సభ్యుల మరణంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 28 శాసన సభ స్థానాలకు నవంబర్‌ 3న జరిగిన పోలింగ్‌ జరిగింది. మంగళవారం ఉదయం మొదలైన కౌంటింగ్‌ బుధవారం తెల్లవారు జామున ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చౌహాన్‌ మాట్లాడుతూ.. ఉప ఎన్నికల్లో విజయాన్నిమధ్యప్రదేశ్‌ ప్రజల విజయంగా అభివర్ణించారు. అభివృద్ధికి, ప్రభుత్వంపై గల విశ్వాసానికి, ప్రజాసౌమ్యానికి ప్రతీకగా ఈ విజయాన్ని పేర్కొన్నారు. బీజేపీ పైగల విశ్వాసంతో ఓట్ల రూపంలో మధ్యప్రదేశ్‌ ప్రజలు దీవించారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రతిజ్ఞ చేశారు. (చదవండి: బీజేపీకే ఎందుకు పట్టంగట్టారు!?)

మరిన్ని వార్తలు