RCB VS RR: ఐపీఎల్‌లో వందో విజయాన్ని నమోదు చేసిన ఆర్సీబీ

6 Apr, 2022 13:16 IST|Sakshi
Photo Courtesy: IPL

100 Wins For RCB In IPL: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అరుదైన ఘనత సాధించింది. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 5) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఆ జట్టు.. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో వందో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 


లీగ్‌ ప్రారంభమైన నాటి (2008) నుంచి ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌ వరకు మొత్తం 214 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 100 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించగా, 107 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాకపోగా, 2 మ్యాచ్‌ల్లో టై బ్రేకర్‌లో గెలుపు, మరో మ్యాచ్‌లో టై బ్రేకర్‌లో ఓటమి చవిచూసింది. ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో ముంబై ఇండియన్స్‌ (219 మ్యాచ్‌ల్లో 125 విజయాలు) అగ్రస్థానంలో ఉండగా, రెండో స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్‌ (198 మ్యాచ్‌ల్లో 117 విజయాలు), మూడో ప్లేస్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (212 మ్యాచ్‌ల్లో 109 విజయాలు) జట్లు ఉన్నాయి. 

ఆర్సీబీ సెంచరీ సెలబ్రేషన్స్ అదుర్స్‌..
ఐపీఎల్‌లో తమ జట్టు వందో విజయాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌లో ఆటగాళ్లతో పాటు ఆర్సీబీ బృంద సభ్యులంతా పాల్గొని రచ్చరచ్చ చేశారు. ఆర్సీబీ యాజమాన్యం వెరైటీ వంటకాలతో కూడిన ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఆర్సీబీ నినాదాలతో డ్రెస్సింగ్ రూమ్ మార్మోగిపోయింది. ఐ యామ్ ప్రౌడ్ టు బి ఆర్సీబియన్ అంటూ ఆటగాళ్లు అంబరాన్నంటేలా నినదించారు. సెంచరీ సెలబ్రేషన్స్‌లో కొత్త పెళ్లికొడుకు మ్యాక్స్‌వెల్ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు.


ఇక ఆర్‌ఆర్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ, గత మ్యాచ్‌లతో పోలిస్తే కాస్త మెరుగ్గానే బౌలింగ్‌ చేసి ప్రత్యర్ధిని 169 పరుగులకు కట్టడి చేయగలిగింది. బట్లర్‌ (70 నాటౌట్‌), హెట్మేయర్‌ (42 నాటౌట్‌) ఆఖర్లో బ్యాట్‌ ఝులిపించడంతో ఆర్‌ఆర్‌ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. ఛేదనలో ఆర్సీబీ కాస్త తడబడినప్పటికీ దినేశ్‌ కార్తీక్‌ (44 నాటౌట్‌), షాబాజ్‌ అహ్మద్‌ (45) అద్భుతమైన ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఆర్సీబీ ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.    
చదవండి: ‘అత్యుత్తమ ఫినిషర్‌’.. నా కెరీర్‌ ముగిసిపోలేదు.. అందుకే ఇప్పుడిలా!


 

>
మరిన్ని వార్తలు