రన్నర్‌ రాంబాయి.. 105 నాట్‌అవుట్‌

23 Jun, 2022 00:37 IST|Sakshi

వయసు సెంచరీ దాటిన తరువాత రెండు అడుగులు వేయాలంటే.. కర్ర, మంచం, కుర్చి, వాకర్‌ వంటివాటి సాయం తప్పక తీసుకోవాల్సిందే. అటువంటిది హరియాణాకు చెందిన 105 ఏళ్ల ‘రాంబాయి’  బామ్మ అత్యంత  వేగంగా పరుగెత్తి జాతీయ  రికార్డులను తిరగరాయడమేగాక, రెండు స్వర్ణపతకాలను అవలీలగా గెలుచుకుంది. శాకాహారం మాత్రమే తీసుకునే ఈ బామ్మ ఇంతటి లేటువయసులో ఎంతో చలాకీగా ఉంటూ  యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది.  
 
జూన్‌ 15న అథ్లెటిక్స్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా వడోదరాలో  నిర్వహించిన ప్రారంభ నేషనల్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో వంద మీటర్ల దూరాన్ని కేవలం 45.40 సెకన్లలో పరుగెత్తి స్వర్ణపతకాన్ని గెలుచుకుంది రాంబాయి. గతంలో 101 ఏళ్ల మన్‌ కౌర్‌ ఇదే వంద మీటర్ల దూరాన్ని 74 సెకన్లలో పూర్తిచేసి రికార్డు నెలకొల్పింది. కౌర్‌కంటే వేగంగా పరుగెత్తిన రాంబాయి ఈ రికార్డుని  బద్దలు కొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. తాజాగా ఆదివారం (జూన్‌19)న నిర్వహించిన రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకనులలో పూర్తిచేసి  మరో స్వర్ణపతకాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టింది రాంబాయి బామ్మ. చిన్నప్పటి నుంచి రేసుల్లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. పరుగు పందెంలో పాల్గొనడానికి అవకాశం రావడంతో... గతేడాదిలో రన్నింగ్‌ సాధన మొదలు పెట్టి రేసులలో పాల్గొనడం ప్రారంభించింది. గతేడాది నవంబర్‌లో వారణాసిలో తొలిసారి పరుగు పందెంలో పాల్గొంది. అక్కడ రాంబాయి రన్నింగ్‌ బావుండడంతో..ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, కేరళలో జరిగే పోటీల్లో పాల్గొని డజనకు పైగా పతకాలను గెలుచుకుంది.

తాజాగా వడోదరలో వందేళ్లకు ౖపైబడిన వారికి నిర్వహించే పరుగు పందెంలో ఎంతో చలాకీగా పాల్గొని రెండు స్వర్ణ పతకాలు గెలుచుకున్న ఉత్సాహంతో.. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని విజేతగా నిలవాలని కలలు కంటూ పాస్‌పోర్టును సిద్ధం చేసుకుంటోంది ఈ సెంచరీ బామ్మ. రాంబాయి కుటుంబంలో ఆమె ఒక్కరే కాకుండా కొంతమంది కుటుంబ సభ్యులు సైతం వివిధ క్రీడల్లో పతకాలు సాధించిన వారే. రాంబాయి 62 ఏళ్ల కూతురు సంత్రా దేవి రిలే రేస్‌లో స్వర్ణ పతకం, కుమారులు ముఖ్తార్‌ సింగ్, వధు భటెరీలు రెండు వందల మీటర్ల రేస్‌లో కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

పాలు పెరుగు...
రాంబాయి శాకాహారి. అరకేజీ పెరుగు,అరలీటరు పాలు, పావుకేజీ వెన్న, జొన్న పిండితో చేసిన బ్రెడ్‌ను రోజువారి ఆహారంగా తీసుకుంటుంది. ఉదయాన్నే ఐదు గంటలకు నిద్రలేచి రోజూ పొలంలో పనిచేయడానికి మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల వరకు నడిచి వెళ్తుంది. సొంత పొలంలో పండిన పంటనే ఆహారంగా తీసుకోవడం, క్రమం తప్పని నడకతో వయసు సెంచరి దాటినప్పటికీ.. యాక్టివ్‌గా ఉంటోంది.

అవకాశం ఇవ్వలేదు...
‘నేను ఎప్పుడో పరుగెత్తాలని అనుకున్నాను. కానీ నాకెవరు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం నా మనవరాలు షర్మిలతో వచ్చి ఇక్కడ పాల్గొన్నాను. మా కుంటుబంలో ఎక్కువ మంది క్రీడారంగంలో రాణిస్తున్నారు. ఈ రోజు నేను కూడా వారి జాబితాలో చేరాను. షర్మిల కూడా పతకాలు గెలుచుకుంది. పాలు పెరుగు, చుర్మాలే నన్ను గెలిపించాయి. ఇవే నన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాయి’ అని రాంబాయి చెప్పింది.
 

మరిన్ని వార్తలు