కోహ్లి.. అప్పుడే 12 ఏళ్లయిందా!

18 Aug, 2020 13:40 IST|Sakshi

ముంబై : సమకాలీన క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్‌ అంతా ఒకవైపు.. విరాట్‌ కోహ్లీ ఒక్కడే ఒక వైపు అన్నట్లుగా ఉంటుంది. పరుగుల యంత్రంగా పేరు తెచ్చకున్న కోహ్లి ఖచ్చితమైన ఫామ్‌లో ఉన్నాడంటే అతన్ని ఆపడం ఎవరితరం కాదు. మైదానంలోకి దిగిన ప్రతీసారి ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. కోహ్లి ఉన్నాడంటే అవతలి జట్టు గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే అనేంతగా ముద్ర వేశాడు.ఒకప్పుడు సచిన్‌ పేరు ఎలా మారుమోగేదో.. ఇప్పుడు కోహ్లి పేరు కూడా అలాగే వినిపిస్తుంది. ఇరవై ఎనిమిదేళ్ల వయసులోనే అన్ని ఫార్మాట్లకు కెప్టెన్‌గా పనిచేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాంటి కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటికి (ఆగస్టు 18) సరిగ్గా పుష్కరకాలం అయింది.(చదవండి : ధోని అధ్యాయం ఎన్నటికీ చెరిగిపోనిది)

2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు సచిన్‌, సెహ్వాగ్‌ గాయాల కారణంగా దూరమవడంతో అనూహ్యంగా కోహ్లీకి జట్టులో చేరే అవకాశం లభించింది. కానీ ఆ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమయ్యాడు. గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విరాట్ 12 పరుగులే చేసి ఔటయ్యాడు. కాకపోతే ఆ సిరీస్‌లో నాలుగో మ్యాచ్‌లో కోహ్లీ అర్ధ శతకంతో టోర్నీ భారత్‌ సొంతమైంది. అంతకుముందు 2008 అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టుకు కెప్టెన్సీ వహించిన కోహ్లీ ఆ ఏడాది భారత్‌ను చాంపియన్‌గా నిలిచాడు. దీంతో కోహ్లి రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. ఆ వెంటనే ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ నుంచి పిలుపొచ్చింది.

2009లో భారత్‌లో శ్రీలంక పర్యటించినప్పుడు నాలుగో వన్డేకు గాయంతో యువరాజ్ దూరమయ్యాడు. అతని స్థానంలో కోహ్లీకి అవకాశం లభించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన తొలి శతకాన్ని సాధించాడు.  అలా మొదలైన సెంచరీల సునామీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అన్ని ఫార్మాట్లు కలిపి 70 సెంచరీలు చేసిన కోహ్లి త్వరలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును బద్దలు కొట్టడానికి దూసుకెళ్తున్నాడు.తాజాగా కోహ్లి 12 ఏళ్ల ప్రస్తానాన్ని పురస్కరించుకొని మొహలీ వేదికగా 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో కోహ్లి 154* పరుగుల ఇన్నింగ్స్‌ను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. (‘ధోనితో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’)

మరిన్ని వార్తలు