IPL 2022 Mega Auction: రేసులో 1214 మంది ఆటగాళ్లు.. 

22 Jan, 2022 15:48 IST|Sakshi

1214 Players Registered For IPL 2022 Mega Auction: బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో మొత్తం 1214 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు కొత్త జట్లు(లక్నో, అహ్మదాబాద్‌) కలుపుకుని మొత్తం 10 జట్లు ఈసారి వేలంలో పాల్గొంటాయి. వేలంలో పేర్లు నమోదు చేసుకునేందుకు జనవరి 20తో గడువు ముగియడంతో బరిలో ఉండే ఆటగాళ్ల తుది జాబితాను బీసీసీఐ శనివారం విడుదల చేసింది. 

ఈ వేలంలో పాల్గొనబోయే 1214 మంది ఆటగాళ్లలో 896 మంది భారతీయ క్రికెటర్లు కాగా.. 318 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో 270 మంది క్యాప్‌డ్‌ (జాతీయ జట్టు తరఫున ఆడినవారు), 903 మంది అన్‌క్యాప్‌డ్ (జాతీయ జట్టుకు ఆడని వారు), 41 మంది అసోసియేట్‌ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా(59)కు చెందిన వారు కాగా, ఆ తర్వాత సౌతాఫ్రికా (48), శ్రీలంక (36), ఇంగ్లండ్ (30), న్యూజిలాండ్‌ (29), అఫ్ఘానిస్థాన్‌ (20) దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. నేపాల్‌ (15), యూఎస్‌ఏ (14), నమీబియా (5), ఒమన్ (3), భూటాన్‌ (1), యూఏఈ (1), నెదర్లాండ్స్‌ (1), స్కాట్లాండ్‌ వంటి అసోసియేట్ దేశాల ఆటగాళ్లు సైతం మెగా వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 


విదేశీ ఆటగాళ్లు కలుపుకుని మొత్తం 49 మంది 2 కోట్ల బేస్ ప్రైజ్‌ విభాగంలో ఉండగా, భారత్‌ నుంచి శ్రేయస్ అయ్యర్, శిఖర్‌ ధవన్‌తో పాటు 17 మంది ఈ విభాగంలో పోటీపడనున్నారు. ఈ విభాగంలో అశ్విన్, చహల్, దీపక్ చాహర్, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, భువనేశ్వర్ కుమార్, దేవదత్ పడిక్కల్, కృనాల్ పాండ్యా, హర్షల్ పటేల్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, రాబిన్ ఊతప్ప, ఉమేశ్ యాదవ్‌ వంటి భారత క్రికెటర్లుండగా.. పాట్‌ కమిన్స్‌(ఆస్ట్రేలియా), వార్నర్‌, డికాక్‌(దక్షిణాఫ్రికా), డెప్లెసిస్‌, రబాడ, ఎవిన్‌ లూయిస్‌(వెస్టిండీస్‌) వంటి విదేశీ ఆటగాళ్లున్నారు. 


మరోవైపు 1.5 కోట్ల విభాగంలో 20 మంది(విదేశీ ఆటగాళ్లతో పాటు), కోటి విభాగంలో 31 మంది ఆటగాళ్లు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. కోటిన్నర విభాగంలో ఫించ్‌, బెయిర్‌స్టో, మోర్గన్‌, డేవిడ్‌ మలాన్‌, హెట్‌మైర్‌, పూరన్‌ వంటి విదేశీ క్రికెటర్లు, ఇషాంత్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌ వంటి దేశీయ స్టార్లు ఉండగా.. కోటి విభాగంలో నటరాజన్, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్‌ వంటి లోకల్‌ స్టార్స్‌.. మహమ్మద్ నబీ, డెవాన్‌ కాన్వే, లివింగ్‌స్టోన్‌ డస్సెన్‌ వంటి ఓవర్‌ సీస్‌ ప్లేయర్స్‌ ఉన్నారు.
చదవండి: IPL 2022: కేఎల్ రాహుల్‌కు జాక్‌పాట్‌.. లీగ్‌ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనరేషన్‌

మరిన్ని వార్తలు