2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న 20 జట్లు ఇవే.. 

1 Dec, 2023 11:26 IST|Sakshi

2024 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే 20 జట్లు ఏవేవో నిన్నటితో తేలిపోయాయి. ఆఫ్రికా క్వాలిఫయర్‌ 2023 పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నమీబియా, ఉగాండ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

టోర్నీలో భాగంగా నిన్న (నవంబర్‌ 30) జరిగిన మ్యాచ్‌లో రువాండపై విజయం సాధించడం ద్వారా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. ఇదే టోర్నీలో నమీబియా టేబుల్‌ టాపర్‌గా నిలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. 

కాగా 2024 టీ20 వరల్డ్‌కప్‌ యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికలుగా వచ్చే ఏడాది జూన్‌ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. కరీబియన్‌ దీవుల్లోని ఆంటిగ్వా అండ్‌ బర్బుడా, బార్బడోస్‌, డొమినికా, గయానా,సెయింట్‌ లూసియా, సెయింట్‌ విన్సెంట్‌ అండ్‌ ద గ్రెనడైన్స్‌ నగరాల్లో .. యూఎస్‌ఏలోని డల్లాస్‌, ఫ్లోరిడా, న్యూయార్క్‌ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్‌ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్‌-8లో నిలిచిన ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఇండియా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్‌.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్‌, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్‌, కెనడా, నేపాల్‌, ఓమన్‌, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్‌ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి. 

మరిన్ని వార్తలు