ఈ బెంగ తీరనిది..!

8 Nov, 2020 05:28 IST|Sakshi

బెంగళూరు బోల్తా.. కోహ్లిపై విమర్శలు

టైటిల్‌ వేటలో మరో వైఫల్యం

‘విలియమ్సన్‌ క్యాచ్‌ను పడిక్కల్‌ పట్టి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో’... ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఓడిన తర్వాత రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్య ఇది! ఇదొక్కటి చాలు ఐపీఎల్‌లో అతని నాయకత్వ వైఫల్యానికి ఉదాహరణగా చూపించేందుకు. బ్యాటింగ్‌లో 131 పరుగులే చేయగలిగిన తమ వైఫల్యాన్ని చెప్పుకోకుండా 17 బంతుల్లో రైజర్స్‌ 27 పరుగులు చేయాల్సిన స్థితిలో ఎంతో కష్టసాధ్యమైన క్యాచ్‌ను తీవ్రంగా ప్రయతి్నంచిన తర్వాత కూడా ఒక యువ ఆటగాడు అందుకోలేకపోతే పరాజయాల్లో దానిని ఒక కారణంగా చూపించడం కోహ్లి పరిణతిని ప్రశ్నిస్తోంది. గత మూడు సీజన్లలో వరుసగా ఎనిమిది, ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన బెంగళూరు జట్టు ఈసారి కొంత మెరుగ్గా నాలుగో స్థానంతో ముగించింది. అయితే తొలి సీజన్‌ నుంచి అభిమానులు ఆశిస్తున్న టైటిల్‌ కోరిక మాత్రం తీరలేదు. ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా ఘనమైన రికార్డు ఉన్న కోహ్లి ఐపీఎల్‌ నాయకత్వంపై కూడా ఈ ప్రదర్శన సందేహాలు రేకెత్తిస్తోంది.  –సాక్షి క్రీడా విభాగం

ఈసారి ఐపీఎల్‌లో తాము ఆడిన చివరి నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు, ఎలిమినేటర్‌ కలిపి వరుసగా ఐదు మ్యాచ్‌లలో బెంగళూరు ఓటమి పాలైంది. ఈ ఐదుసార్లు ముందుగా బ్యాటింగ్‌ చేసిన జట్టు ఒక్కసారిగా మాత్రమే 160 పరుగులు దాటగలిగింది. ఇలాంటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో గెలుపును కోరుకోవడం అత్యాశే అవుతుంది. 2019 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ టోర్నీ తొలి ఆరు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచినా అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే 2008 నుంచి ఎదురు చూస్తున్నట్లుగానే ఈసారి కూడా బెంగళూరు అభిమానులు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడైనా కోహ్లి ట్రోఫీని అందిస్తాడని నమ్మారు. అందుకు తగినట్లుగా తొలి 10 మ్యాచ్‌లలో 7 గెలవడంతో ఆర్‌సీబీ సరైన దిశలోనే వెళుతున్నట్లు అనిపించింది. కానీ కథ మళ్లీ మొదటికి వచి్చంది. ఆ తర్వాత ఒక్క గెలుపూ దక్కక... రన్‌రేట్‌ అదృష్టం కలిసొచ్చి నాలుగో స్థానంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా, ఎలిమినేటర్‌లోనే జట్టు ఆట ముగిసింది.  

ఏబీ మెరుపు ప్రదర్శన...
బెంగళూరు తరఫున ఏబీ డివిలియర్స్‌ ప్రదర్శనే హైలైట్‌గా నిలిచింది. ఏకంగా 158.74 స్ట్రయిక్‌రేట్‌తో అతను 454 పరుగులు సాధించాడు. ఏబీ అర్ధసెంచరీ చేసిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు సార్లు జట్టు గెలిచింది. డివిలియర్స్‌కు ఇతరుల నుంచి సహకారం లభించలేదు. తొలి ఐపీఎల్‌ ఆడిన యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ జట్టు తరఫున అత్యధికంగా 473 పరుగులు చేయడం మరో చెప్పుకోదగ్గ అంశం. బౌలింగ్‌లో 21 వికెట్లతో చహల్‌ సత్తా చాటగా, ఆరుకంటే తక్కువ ఎకానమీ నమోదు చేసిన వాషింగ్టన్‌ సుందర్‌ కూడా ఆకట్టుకున్నాడు. ఆ్రస్టేలియా కెపె్టన్‌ ఫించ్‌ వైఫల్యం (268 పరుగులు–1 అర్ధ సెంచరీ) జట్టును బాగా దెబ్బ తీసింది. గాయంతో మోరిస్‌ 9 మ్యాచ్‌లకే పరిమితం కావడం కీలక సమయంలో సమస్యగా మారింది. సీనియర్‌ పేసర్లు స్టెయిన్‌ (11.40 ఎకానమీ), ఉమేశ్‌ యాదవ్‌ (11.85)లు ఘోరంగా విఫలమవ్వగా... కోల్‌కతాతో (3/8) ప్రదర్శన మినహా సిరాజ్‌ భారీగా పరుగులిచ్చాడు. లోయర్‌ ఆర్డర్‌లో ధాటిగా ఆడే ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా లేకపోవడం జట్టులో పెద్ద లోటుగా కనిపించింది.  

కోహ్లి అంతంతే...
అన్నింటికి మించి కోహ్లి వ్యక్తిగత వైఫల్యం కూడా జట్టును ఇబ్బంది పెట్టింది. కెపె్టన్‌ మొత్తంగా 466 పరుగులు చేసినా...స్ట్రయిక్‌రేట్‌ 121.35కే పరిమితమైంది. 2012 సీజన్‌లో వెటోరి మధ్యలో తప్పుకోవడంతో కెపె్టన్‌గా కోహ్లి బాధ్యతలు స్వీకరించాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు అతనే సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఎనిమిది పూర్తి సీజన్లలో కూడా కోహ్లి తన జట్టుకు టైటిల్‌ అందించలేకపోవడం అభిమానులను తీవ్రంగా బాధిస్తోంది. 2016లో రన్నరప్‌గా నిలవడమే అత్యుత్తమ ప్రదర్శన. 125 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరిస్తే గెలిచిన మ్యాచ్‌లకంటే (55) ఓడిన మ్యాచ్‌ల సంఖ్య (63) ఎక్కువ. ఈ నేపథ్యంలో కోహ్లి ఇంకా కెప్టెన్‌గా కొనసాగుతాడా, ఫ్రాంచైజీ యాజమాన్యం మార్పు కోరుకుంటుందా అనేది చూడాలి.

బ్యాటింగ్‌పరంగా తాను నెలకొలి్పన ప్రమాణాలను కోహ్లి అందుకోలేకపోయాడు. అతనివైఫల్యమే జట్టును ముందుకు తీసుకుపోలేకపోయింది. ఇంత కాలం బౌలింగ్‌ బలహీనంగా ఉండి ఓడిన బెంగళూరు ఇప్పుడు బ్యాటింగ్‌ బలహీనతతో ఓడింది.  
 –సునీల్‌ గావస్కర్‌

100 శాతం కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించాలనేదే నా అభిప్రాయం. ఈ పరాజయాలకు నేనే కారణమని అతనే చెప్పుకోవాలి. ఎనిమిదేళ్లు అంటే చాలా ఎక్కువ సమయం. ఇన్నేళ్లు ఒక్క ట్రోఫీ గెలవకుండా కూడా కెపె్టన్‌గా ఎవరైనా కొనసాగగలరా. కెప్టెన్సీ విషయంలో ధోని (3 టైటిల్స్‌), రోహిత్‌ (4 టైటిల్స్‌)లతో కోహ్లికి అసలు పోలికే లేదు.  సరిగ్గా చెప్పాలంటే బెంగళూరుకు ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అర్హతే లేదు. ఒక్క డివిలియర్స్‌ ప్రదర్శనతోనే వారు ముందుకొచ్చారు.    
– గంభీర్‌

మరిన్ని వార్తలు