ఎవరిదో కొత్త చరిత్ర?

8 Feb, 2021 05:06 IST|Sakshi

నేటి నుంచి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

అందరి దృష్టి జొకోవిచ్, నాదల్, సెరెనాలపై

ఉదయం గం. 5:30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

మెల్‌బోర్న్‌: టెన్నిస్‌ సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం మొదలయ్యే ఈ మెగా టోర్నీలో అగ్రశ్రేణి క్రీడాకారులు జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), సెరెనా విలియమ్స్‌ (అమెరికా) కొత్త చరిత్ర లిఖించేందుకు బరిలోకి దిగుతున్నారు. సోమవారం జరిగే పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 66వ ర్యాంకర్‌ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌)తో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ తలపడనున్నాడు.


ఒకవేళ ఈ టోర్నీలో జొకోవిచ్‌ విజేతగా నిలిస్తే అత్యధికంగా తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన ప్లేయర్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతాడు. స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ చాంపియన్‌గా నిలిస్తే పురుషుల సింగిల్స్‌ విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తాడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌తో ప్రస్తుతం ఫెడరర్, నాదల్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. మంగళవారం జరిగే తన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 56వ ర్యాంకర్‌ లాస్లో జెరి (సెర్బియా)తో నాదల్‌ ఆడనున్నాడు. జొకోవిచ్, నాదల్‌తోపాటు ప్రస్తుత యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్, మూడో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), నాలుగో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) కూడా టైటిల్‌ ఫేవరెట్స్‌గా ఉన్నారు.  

మహిళల సింగిల్స్‌ విభాగంలో పోటీ తీవ్రంగా ఉంది. ఏ ఒక్కరినీ కచ్చితమైన ఫేవరెట్‌ అని పేర్కొనే పరిస్థితి కనిపించడంలేదు. డిఫెండింగ్‌ చాంపియన్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా), ప్రపంచ నంబర్‌వన్‌ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), మూడో ర్యాంకర్‌ నయోమి ఒసాకా (జపాన్‌), రెండో ర్యాంకర్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా), 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ విజేత సెరెనా విలియమ్స్‌ (అమెరికా) టైటిల్‌ రేసులో ఉన్నారు. ఈ ఐదుగురితోపాటు మాజీ చాంపియన్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌), ఐదో ర్యాంకర్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), తొమ్మిదో ర్యాంకర్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ విజేత కెర్బర్‌ (జర్మనీ) కూడా టైటిల్‌ గెలిచే అవకాశాలున్నాయి. సోమవారం జరిగే తొలి రౌండ్‌లో లౌరా సిగెమండ్‌ (జర్మనీ)తో సెరెనా, పావ్లీచెంకోవా (రష్యా)తో ఒసాకా ఆడతారు. సెరెనా చాంపియన్‌గా నిలిస్తే మహిళల టెన్నిస్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్‌) పేరిట ఉన్న రికార్డును సమం చేస్తుంది. 2017లో చివరిసారి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచిన సెరెనా ఆ తర్వాత మరో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఫైనల్‌ చేరినా చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

మరిన్ని వార్తలు