భారత్‌ బరిలోకి దిగేది వచ్చే ఏడాదే

13 Aug, 2020 08:46 IST|Sakshi

న్యూఢిల్లీ : ఏడాది పొడవునా వేళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడే భారత ఫుట్‌బాల్‌ జట్టు ఈ ఏడాదిలో మిగిలిన రోజులను ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడకుండానే ముగించనుంది. కరోనా వైరస్‌ ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో... ఆసియా పరిధిలో అక్టోబర్, నవంబర్‌లలో జరగాల్సిన 2022 ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను... 2023 ఆసియా కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.

భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను గత సంవత్సరం నవంబర్‌లో మస్కట్‌ వేదికగా ఒమన్‌ జట్టుతో ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌  0–1 గోల్‌ తేడాతో ఓడింది. ఖతర్‌లో జరిగే 2022 ప్రపంచకప్‌ మెగా ఈవెంట్‌కు భారత్‌ అర్హత సాధించే అవకాశాలకు తెరపడినా 2023 ఆసియా కప్‌కు బెర్త్‌ పొందే అవకాశాలు మిగిలి ఉన్నాయి. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 8న ఖతర్‌తో... ఆ తర్వాత స్వదేశంలో నవంబర్‌లో అఫ్గానిస్తాన్‌తో... నవంబర్‌లోనే బంగ్లాదేశ్‌తో భారత్‌ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఐదు జట్లున్న గ్రూప్‌ ‘ఇ’లో ప్రస్తుతం భారత్‌ మూడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.

టాప్‌–3లో నిలిస్తే భారత్‌కు 2023 ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌ మూడో రౌండ్‌లోకి నేరుగా బెర్త్‌ లభిస్తుంది. ‘చాలా దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రతను దృషిలో పెట్టుకొని ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్, ఆసియా కప్‌ క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లను వాయిదా వేశాం. ఈ మ్యాచ్‌లను వచ్చే ఏడాది ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తాం’ అని ప్రపంచ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా), ఆసియా ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఎఫ్‌సీ) ఒక ప్రకటనలో తెలిపాయి. 

మరిన్ని వార్తలు