London Marathon: విషాదం నింపిన మారథాన్‌.. ట్రాక్‌పైనే కుప్పకూలిన అథ్లెట్‌

4 Oct, 2022 08:58 IST|Sakshi

గత ఆదివారం నిర్వహించిన లండన్‌ మారథాన్‌ 2022లో విషాదం నెలకొంది. మారథాన్‌లో పాల్గొన్న 36 ఏళ్ల అథ్లెట్‌ ట్రాక్‌పైనే కుప్పకూలాడు. ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా అథ్లెట్‌ మరణించినట్లు వైద్యులు ద్రువీకరించారు. అయితే చనిపోయిన అథ్లెట్‌ కుటుంబసభ్యుల వినతి మేరకు నిర్వాహకులు పేరును వెల్లడించలేదు. అయితే అథ్లెట్‌ మాత్రం సౌత్‌-ఈస్ట్‌ ఇంగ్లండ్‌కు చెందినవాడని పేర్కొన్నారు. మరో మూడు మైళ్లు చేరుకుంటే అతని రేసు పూర్తయ్యేది.. కానీ విధి మరోలా తలిచింది అంటూ మారథాన్‌ నిర్వాహకులు తమ బాధను వ్యక్తం చేశారు.

''లండన్‌ మారథాన్‌లో పాల్గొన్న ప్రతి అథ్లెట్‌ ఇవాళ మరణించిన తమ సహచర అథ్లెట్‌కు నివాళి అర్పిస్తున్నారు. అతని కుటుంబసభ్యుల వినతి మేరకు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచాలని భావించాం. అతని కుటుంబసభ్యులకు ఇవే మా ప్రగాడ సానభుతి.''అంటూ పేర్కొంది. ఇక అథ్లెట్‌ మరణంపై తుది రిపోర్టు రావాల్సి ఉందని నిర్వహాకులు పేర్కొన్నారు.

ఇక ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా లండన్‌ మారథాన్‌ 2022 ఘనంగా జరిగింది. దాదాపు 40వేల మంది ఈ మారథాన్‌లో పాల్గొన్నట్లు సమాచారం. 26.2 మైళ్ల దూరంలో భాగంగా సౌత్‌ లండన్‌లోని గ్రీన్‌విచ్‌ నుంచి మాల్‌ వరకు ఈ మారథాన్‌ జరిగింది. పురుషుల విభాగంలో కెన్యాకు చెందిన అమోస్‌ కిప్రుటో విజయం సాధించాడు. కిప్రుటో రెండు గంటల నాలుగు నిమిషాల 39 సెకన్లలో మారథాన్‌ను పూర్తి చేసి తొలి స్థానంలో నిలిచాడు. ఇక  మహిళల విభాగంలో ఇథియోపియాకు చెందిన యెహువాలా మారథాన్‌ను 2 గంటల 17 నిమిషాల 25 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచింది.

చదవండి: 'చదువును చంపకండి'.. రషీద్‌ ఖాన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌

మరిన్ని వార్తలు