రెండేళ్ల కిందట ఇదే గ్రౌండ్‌లో షమీ విశ్వరూపం, మళ్లీ రిపీటయ్యేనా?

22 Jun, 2021 19:05 IST|Sakshi

సౌథాంప్టన్‌: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు (2019, జూన్ 22), సౌథాంప్టన్‌ వేదికగా టీమిండియా పేసర్ మహ్మద్ షమీ విశ్వరూపం ప్రదర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో లాలా.. హ్యాట్రిక్ సాధించి, మెగా ఈవెంట్‌లో ఈ అరుదైన ఘనత సాధించిన రెండో భారతీయ పేసర్‌గా చరిత్రకెక్కాడు. కాగా, ఆ అరుదైన ఫీట్‌ను మరోసారి రిపీట్‌ చేసే అవకాశం షమీకి మళ్లీ వచ్చిందని టీమిండియా అభిమానులు అంటున్నారు. 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పట్టు బిగించారు.135 పరుగులకే న్యూజిలాండ్‌ సగం వికెట్లను పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట జరగాల్సి ఉన్న నేపథ్యంలో లాలా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాలని అభిమానులు ఆశిస్తున్నారు. లాలా.. మరో హ్యాట్రిక్ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఇదిలా ఉంటే, సౌథాంప్టన్‌ వేదికగా అఫ్ఘనిస్తాన్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో‌ షమీ హ్యాట్రిక్‌ సాధించడంతో టీమిండియా ఊపిరిపీల్చుకుంది. 225 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన అఫ్ఘన్‌కు శుభారంభం లభించింది. ఆఫ్ఘన్‌ గెలుపుకు ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా,  షమీ చేతికి కెప్టెన్‌ కోహ్లీ బంతినిచ్చాడు. అప్పటికే మహమ్మద్‌ నబీ ఒంటిరి పోరాటం చేస్తూ.. మాంచి ఊపుమీదున్నాడు. 

తొలి బంతిని నబీ ఫోర్‌ బాది భారత శిబిరంలో ఆందోళన రేకెత్తించాడు. ఆ మరుసటి బంతికి సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా అతను క్రీజ్‌ను వదల్లేదు. నాలుగు బంతుల్లో 12 పరుగులుగా సమీకరణం మారిన నేపథ్యంలో షమీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వరుస బంతుల్లో నబీ, అఫ్తాబ్‌ అలామ్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌లను అవుట్‌ చేసి టీమిండియాకు అపురూపమైన విజయాన్ని అందించాడు. దీంతో ప్రపంచకప్‌లో చేతన్‌ శర్మ తరువాత హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. 
చదవండి: కౌంటీ క్రికెట్‌ చరిత్రలో దారుణమైన గణాంకాలు నమోదు

మరిన్ని వార్తలు